Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు
- సర్కారు సమాలోచన
- సీఎం కేసీఆర్‌తో మంత్రి సంప్రదింపులు
- అతిత్వరలోనే నిర్ణయం
- కొంపముంచిన ప్రమోట్
- ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- ఇంటర్ బోర్డును ముట్టడించిన ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ
- న్యాయం చేయాలంటూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి ఫెయిలైన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీస మార్కులతో అందరినీ పాస్ చేయాలన్న సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సంప్రదిం చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఫెయిలైన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్లగొండకు చెందిన జాహ్నవి రైలు కింద పడి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులతో పాస్ చేసే అంశంపై ప్రభుత్వం అతిత్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఆలస్యం చేస్తే మరింత మంది ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదముందని విద్యార్థి సంఘాల నేతలు, అధ్యాపక సంఘాల నేతలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గించాలనీ, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), ప్రగతిశీల విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో గురువారం ఇంటర్ బోర్డును ముట్టడించాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.
అర్థంకాని ఆన్లైన్ పాఠాలు
కరోనా నేపథ్యంలో 2021లో వార్షిక పరీక్షలు జరగలేదు. దీంతో ఇంటర్ సెకండియర్ విద్యార్థులందర్నీప్రభుత్వం పాస్ చేసింది. అప్పుడు ప్రథమ సంవత్స రం చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేసిన విష యం తెలిసిందే. వారే అక్టోబర్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. 4,59,242 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2,24,012 (49 శాతం) మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణుల య్యారు. 2,35,230 (51 శాతం) మంది ఫెయిల య్యారు. గత విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఆన్లైన్ తరగతులకు ప్రభుత్వం అనుమ తిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 23 వరకు ప్రత్యక్ష బోధన సాగింది. కరోనా తీవ్రత నేపథ్యంలో మార్చి 24 నుంచి విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రత్యక్ష బోధన పూర్తిస్థాయిలో లేకపోవడం, ఆన్లైన్ పాఠాలు అర్థంకాకపోవడం విద్యార్థులను గందరగోళపరిచింది. ఇంకోవైపు విద్యార్థులను ప్రమోట్ చేయడంతో పాసయ్యామనే భ్రమలో ఉన్నారు. ఇది వారి కొంపముంచింది. అందుకే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరైతే పాస్ చేస్తారన్న అభిప్రాయంతో మెజార్టీ విద్యార్థులున్నారు. పాఠాలు అర్థం కాకపోయినా, ఏమీ చదవకపోయినా ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారన్న నమ్మకంతో పరీక్షలకు హాజరయ్యారు. తీరా ఫలితాలను చూసి షాక్‌కు గురవుతున్నారు.
విద్యార్థులకు న్యాయం చేయాలి : కొప్పిశెట్టి సురేష్
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం -475 ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ డిమాండ్‌చేశారు. ప్రత్యక్ష బోధన లేకపోవడం వల్ల ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఆన్లైన్ సౌకర్యం పూర్తిస్థాయిలో లేకపో వడం వల్ల తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వం మేల్కోవాలి : పి మధుసూదన్‌రెడ్డి
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలై మనస్థాపం చెందిన ఇద్దరు విద్యా ర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డి చెప్పారు. మరో విద్యార్థిఆత్మహత్యకు పాల్పడకముందే రాష్ట్రప్రభుత్వం మేల్కో వాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని కోరారు.
విద్యార్థులను పాస్ చేయాలి : పగడాల లక్ష్మయ్య
ప్రత్యక్ష తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహించకుండా పరీక్షలను నిర్వహించడం సరైంది కాదని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య విమర్శించారు. ఫెయిలైన విద్యార్థులకు బేషరతుగా కనీస మార్కులు వేసి పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న జాహ్నవి, ధనుష్ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.