Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్జీలు పెంచేప్పుడే రాష్ట్రానికి గుర్తొస్తున్న కేంద్ర విధానాలు
- ఆర్టీసీ, కరెంటు చార్జీల వడ్డింపునకు కసరత్తు
- కరోనా అంటూ సర్కారు బీదపలుకులు
- ప్రజలపై భారాలకు మాత్రం సై..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'అంతా మీరే చేశారు' ఓ తెలుగు సినిమాలో ట్రెండింగ్ డైలాగ్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్నే వల్లె వేస్తోంది. ఏడున్నరేండ్లుగా గాఢనిద్రలో జోగి, ఇప్పుడే లేచి 'నెనెక్కడున్నాను' అని ప్రశ్నించినట్టే నటిస్తున్నది. నోట్ల రద్దు మొదలు మొన్నటి మూడు వ్యవసాయ చట్టాల వరకు అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు చట్టరూపం ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. వీటిలో అనేక విధాన నిర్ణయాలను రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బాహటంగానే సమర్థించింది. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం 'ధాన్యం కొనుగోలు' అజెండాను సెట్‌చేసి, నానా హంగామా చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వామపక్షాలు మొదలు ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ, రోడ్లపై ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆచితూచి వాటిలో అడుగులేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు గుర్తొచ్చాయి. రాష్ట్రంలో ఆర్టీసీ టిక్కెట్ రేట్లు పెంచాల్సి రావడమే ఈ హఠాత్పరిణామానికి కారణం. రవాణాశాఖ మంత్రి మొదలు టీఎస్ఆర్టీసీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లతో 'డీజిల్' భారం భరించలేకే బస్సు టిక్కెట్లు పెంచాల్సి వస్తున్నదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రతి సమావేశంలోనూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, డీజిల్‌పై పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరితే, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, సప్పుడు చేయలేదు. కనీసం కేంద్రంపై కన్నెర్ర కూడా చేయలేదు. ఇదే తరహాలో కరెంటు చార్జీలు పెంచాల్సి రావడంతో హఠాత్తుగా డిస్కంల నష్టాలు రాష్ట్ర సర్కారుకు గుర్తొచ్చాయి. కేంద్రం విధిస్తున్న అసందర్భ షరతులు, నిర్ణయాల వల్లే డిస్కంలు అప్పుల్లోకి పోతున్నాయనే మాట నిజమే అయినా, రాష్ట్ర సర్కారుకు ఈ విషయం హఠాత్తుగా గుర్తొచ్చిందా అనే సందేహం కలుగుతున్నది. థర్మల్ విద్యుత్కేంద్రాలకు అవసరమైన బొగ్గు ఉత్పత్తి, రవాణా చార్జీలను కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. గ్రీన్ ఎనర్జీ సెస్‌ను రూ.50 నుంచి రూ.400 పెంచారని ఇప్పుడు గగ్గోలు పెడుతూ, ఏడున్నరేండ్లలో రూ.7,200 కోట్లు చెల్లించామంటూ లెక్కలు చెప్పబట్టే! మరి ఇవన్నీ అమల్లోకి వస్తున్నప్పుడు రాష్ట్రప్రభుత్వం ఎందుకు ప్రతిఘటించలేదన్నదే ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. కరెంటు చార్జీలు పెంచితే వచ్చే ప్రజావ్యతిరేకతను తప్పించుకొనేందుకు ఢిల్లీపైకి నెపం నెట్టి, తాను నిమిత్తమాత్రుడిని అని నిరూపించుకోవడమే రాష్ట్ర సర్కారు వ్యూహంగా కనిపిస్తున్నది. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని బెంబేలెత్తిన టీఆర్ఎస్ ప్రభుత్వం, అదే కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా ప్రజలు కుదేలవుతున్న సమయంలో ఆర్టీసీ, కరెంటు చార్జీల పెంపునకు సిద్ధమవుతున్నది. గడచిన మూడ్రోజులుగా కరెంటు చార్జీలపై సమీక్షల పేరుతో ఆర్థికమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి కేంద్రప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పొరుగు రాష్ట్రాల్లోని కరెంటు చార్జీలనూ ప్రకటించి, అక్కడి కంటే తెలంగాణలోనే చార్జీలు తక్కువనీ, అందువల్ల కాస్తో కూస్తో పెంచక తప్పదనే సన్నాయి నొక్కుల్ని నొక్కారు. ముఖ్యమంత్రి తుది నిర్ణయం కోసం కరెంటు చార్జీల టారిఫ్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రెండ్రోజుల్లో వాటిని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి సమర్పించనున్నారు. అలాగే ఆర్టీసీ చార్జీల పెంపుపై మంత్రివర్గంలో తుదినిర్ణయం తీసుకోనున్నారు. ప్రజలపై పడే ఈ 'భార' ఆగ్రహావేశాల నుంచి డిఫెన్స్ చేసుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడ్డుపెట్టుకుంటున్నదనీ, వాస్తవానికి బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పు లేదనేదే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో జరుగుతున్న చర్చ!