Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెప్పేదొకటి... చేసేది మరొకటి
- బ్యాంక్ ఉద్యోగుల రెండో రోజు సమ్మె సక్సెస్
- ఎస్బీఐ ప్యాట్నీ బ్రాంచ్‌లో యూఎఫ్‌బీయూ సభ
- సంఘీభావం తెలిపిన కార్మిక, రైతు, బీమా, రిజర్వుబ్యాంకు ఉద్యోగుల సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జాతీయబ్యాంకుల చట్ట సవరణ (ప్రయివేటీకరణ) బిల్లు-2021ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండ్రోజుల సమ్మె శుక్రవారం ముగిసింది. రెండోరోజు కూడా జాతీయ బ్యాంకులు పనిచేయలేదు. ఉద్యోగులు విధులను బహిష్కరించి బ్యాంకుల బయటే టెంట్లు వేసుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలిరోజు (గురువారం) హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ కార్యాలయ ప్రాంగణం లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. రెండోరోజు శుక్రవారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ కార్యాలయ ప్రాంగణంలో యూఎఫ్‌బీయూ నిరసనలు చేపట్టి, అక్కడే బహిరంగ సభను నిర్వహించింది. వివిధ జాతీయ బ్యాంకులు, శాఖల నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులు ఈ సభలో పాల్గొన్నారు. ''ప్రజల సొమ్ముతో బ్యాంకింగ్-ప్రజల కోసమే బ్యాంకింగ్, అవర్ స్ట్రగుల్-జస్ట్ స్ట్రగుల్, ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిద్దాం, లాభాల్లో ఉన్న బ్యాంకుల్ని ఎందుకు ప్రయివేటుపరం చేస్తున్నారు'' అంటూ బ్యానర్లు కట్టి, ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. రైతు, కార్మిక, బీమా, రిజర్వుబ్యాంకు ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించారు. యూఎఫ్‌బీయూ తెలంగాణ యూనిట్ కన్వీనర్ ఆర్ శ్రీరాం అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ సాగర్, రిజర్వుబ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షులు జీ క్రాంతి, అలిండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఆర్‌ఆర్‌బీఈఏ) ప్రధాన కార్యదర్శి పీ వెంకటేశ్వరరెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ తదితరులు బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని నమ్మొద్దని వారు చెప్పారు. మోడీ సర్కార్ బయటకు ఒకటి చెప్తూ, అమలు మరొకటి చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తున్నదని విమర్శించారు. ఏడాదికి పైగా సాగిన రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, మోడీ, అమిత్‌షాల మెడలు వంచి బ్యాంకుల ప్రయివేటీకరణ బిల్లును ఉపసంహరించుకొనేలా చేస్తామని హెచ్చరించారు. రైతు ఉద్యమం మాదిరే, బ్యాంకు ఉద్యోగులది కూడా దేశభక్తుల పోరాటమని అభివర్ణించారు. బ్యాంకుల ప్రయివేటీకరణ వల్ల నష్టపోయేది సామాన్య ప్రజలేనన్నారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురువుతుందని వివరించారు. 97 శాతం ఉన్న జన్‌ధన్ ఖాతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. యువతరం ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోతుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం పెచ్చరిల్లినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా ఉండటానికి ప్రభుత్వరంగమే ప్రధాన కారణమనే విషయాన్ని విస్మరించరాదని హితవు పలికారు. బ్యాంకు ఉద్యోగుల పోరాటం వారి జీతభత్యాల కోసం కాదనీ, భవిష్యత్ తరాల కోసమేనని స్పష్టంచేశారు.
వారి పోరాటానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు అప్పాస్వామి, నాయకులు కృష్ణంరాజు, విక్రం, ఆంజనేయ ప్రసాద్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రామయ్య, ఐఎన్‌బీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) నాయకులు సంజరుసింగ్ చౌహాన్, డీ ప్రసాద్, సీ సంధ్య, రఘోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.