Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులందరినీ పాస్ చేయాలని, ఫెయిల్ అయిన విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. ఇంటర్ బోర్డు అనాలోచిత నిర్ణయం వల్ల.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.మంచిర్యాల డీఐఈఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్ మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో చాలా తక్కువ శాతం పాస్ కావడం, పాసైన వారిలో కూడా అనేక మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంతో మానసికంగా కుంగి పోతున్నారని తెలిపారు. ఇంటర్ బోర్డు తప్పుడు నిర్ణయాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఫెయిలైన విద్యార్థుల్లో ఆందోళనను, ఒత్తిడిని నివారించడానికి బోర్డు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచల్లి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలోనూ డీఐఈఓకు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్‌లో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్టీఓ రాజేశ్వర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.ఇంటర్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో యూత్ కాంగ్రెస్ పరిగి ప్రెసిడెంట్ నాగవర్ధన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని అన్ని జూనియర్ కాలేజీల విద్యార్థులతో కలిసి బస్టాండ్ ఎదుట బైటాయించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కోవిడ్ ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మొదటి సంవత్సరం విద్యార్థులనందరినీ పాస్ మార్కులతో ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి సాంబ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ఎనిమిది మంది విద్యార్థుల ఉసురు తీసిందన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించాలని డిమాండ్ చేశారు.