Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి కొనుగోళ్లలో దళారుల మోసాలు
- కాంటాల్లో భారీ తేడాలు.. నిండా మునుగుతున్న రైతులు
- గ్రామీణ రైతులే టార్గెట్‌గా అక్రమార్కుల దందా
- 'మామూలు'గా తీసుకుంటున్న అధికారులు
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సాత్‌మోరి గ్రామంలో జగిత్యాలకు చెందిన కొందరు వ్యక్తులు పత్తి వ్యాపారం చేస్తున్నారు.. రైతుల నుంచి ఎలక్ట్రానిక్ కాంటా ద్వారా పత్తి కొనుగోలు చేశారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ 1.80క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. కానీ తూకంలో మాత్రం 1.40క్వింటాళ్లు మాత్రమే వచ్చినట్టు దళారులు చూపించారు. అనుమానం వచ్చిన రైతు మరో చోట పత్తిని తూకం వేయించగా 1.80క్వింటాళ్లుగా వచ్చింది. దళారులు రిమోట్‌తో సంబంధిత కాంటాను ఆపరేట్ చేస్తున్నారనే విషయాన్ని గ్రహించారు. గ్రామస్తులందరూ దళారులను నిలదీసి పోలీసులకు అప్పగించడంతో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి జిల్లాలో తరుచుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో ప్రధాన పంటగా భావించే పత్తి కొనుగోళ్లపై అందరి దృష్టి ఉంటుంది. ప్రతి యేటా సీజన్లో పత్తి చేతికొచ్చాక కాంటాలు, ధరలో దగాకు గురవడం సాధారణంగా మారింది. మార్కెట్లో మద్దతు ధర లభించక పత్తి రైతులు అనేక ఆందోళనలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. భరోసా కల్పించాల్సిన ప్రజాప్రతినిధులు, అండగా ఉండాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు గ్రామాల్లోకొస్తున్న వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు ఎంతంటే అంత ధరకు తెగనమ్ముకుంటున్నారు.. ఇలా ధరలో వ్యాపారులదే పై చేయి కాగా.. కాంటాల్లోనూ దగా చేస్తున్నారు. అనేక మంది వ్యాపారులు ఏజెన్సీ, మారుమూల గ్రామాలకు వెళ్లి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. స్ప్రింగ్ కాంటాలు(ఇంట్లో తూకం వేసేవి), తూనికల(బాట్లు)తో పాటు ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు తాజాగా ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తుండటంతో రైతులు నమ్ముతున్నారు. కానీ ఇందులోనూ మోసం చేస్తారని గ్రహించలేకపోతున్నారు. రిమోట్ పరికరం ద్వారా ఎలక్ట్రానిక్ కాంటాలను ఆపరేట్ చేస్తూ కొలతల్లో తేడాలు వచ్చేలా చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..!
గ్రామాల్లో వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండానే చాలా మంది పత్తి, ధాన్యం వ్యాపారం చేస్తున్నారు. కనీసం తూనీకలకు ఎలాంటి ధ్రువీకరణ ఉండటం లేదు. గ్రామాల్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయకూడదనే నిబంధన కూడా ఉంది. కానీ ప్రస్తుతం గ్రామాల్లో అనేక మంది వ్యాపారులు రైతుల వద్ద నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. మరోపక్క తూకం పరికరాలను పరిశీలించాల్సి, అనుమతులు ఇవ్వాల్సిన తూనీకలు, కొలతల శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు 'మామూలు'గా తీసుకుంటూ వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.