Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామడుగు
జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు వలస కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని కావేరి జిన్నింగ్ మిల్లులో శనివారం ఉదయం జరిగింది. ఎస్ఐ తాండ్ర వివేక్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చిరోళి జిల్లా గొంది గ్రామానికి చెందిన మాలయ తలండ్(26) రామడుగు మండలంలోని వెలిచాల జిన్నింగ్ మిల్లులో మూడేండ్లుగా ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో చలి ఎక్కవగా ఉండటంతో తలకు టవల్ చుట్టుకుంటుండగా.. ప్రమాదశాత్తు అది మిషన్‌లో చిక్కుకుంది. అతని తలను లోపలికి లాగేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అక్క స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండారి శేఖర్
కావేరి జిన్నింగ్ మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వలల్లే కార్మికుడు మృతిచెందాడని, బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండారి శేఖర్ డిమాండ్ చేశారు. ఆయన ఘటనాస్థలానికి చేరుకుని కార్మికుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మిల్లు యాజమాన్యం కార్మికుడి పేరును లేబర్ ఆఫీస్‌లో నమోదు చేయలేదన్నారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు యత్నించారని, మిల్లుపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.