Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీలకు భవిష్యత్ నోటిఫికేషన్లలో అన్యాయం
- స్థానికతను కోల్పోతాం
- బదిలీల్లో ఏకపక్ష వైఖరిని ఖండిస్తున్న టీచర్లు
- ఉపాధ్యాయుల కేటాయింపు మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
నూతన జోనల్ విధానం ప్రకారం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు అనేక విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యంగా ప్రభుత్వం పెట్టిన మెలికలు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి. ప్రో రేటా పద్ధతిన సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో చాలామంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోనున్నారు. దామాషా ప్రాతిపదికన కేటాయింపులు జరపడాన్ని ప్రో రేటాగా వ్యవహరిస్తారు. ఉమ్మడిగా ఉన్న జిల్లా విడిపోయినప్పుడు ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతానికి సముచితంగా పంచాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఎంత నిష్పత్తిలో కేటాయించాలన్న విషయంలో ప్రోరేటాను వాడుతుంటారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ప్రో రేటా ప్రయోగించడం విమర్శలకు తావిస్తున్నది.
ఎస్టీ ఉపాధ్యాయులు.. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ.. సిద్ధిపేట జిల్లాలో తక్కువ ఉన్నారు. ఇలాంటి తరుణంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులను సిద్దిపేటకు బదిలీ చేయడం.. ఇరు జిల్లాల్లో ఎస్టీ ఉపాధ్యాయుల సంఖ్యను సమం చేయడం ప్రో రేటా ఉద్దేశం. అంతవరకు బాగానే ఉన్నా.. ఈ పద్దతిని టీచర్ల బదిలీల్లో ప్రయోగించడం వల్ల సంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కసారి సిద్దిపేటకు టీచర్లకు బదిలీపై తరలివెళ్తే వారి భవిష్యత్, వారి పిల్లల స్థానికతా అక్కడికే షిఫ్ట్ అవుతుంది. ఇక నూతన నోటిఫికేషన్లలో సిద్దిపేటలో ఎస్టీ కోటా ఉద్యోగాలు ఖాళీలు చూపించే పరిస్థితి ఉండదు. అందుకే ప్రో రేటా మాకు వద్దే వద్దంటూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు.
సీనియారిటీ ఆధారంగా బదిలీ జాబితా
ఉమ్మడి మెదక్ జిల్లాలోని విద్యాశాఖలో 11,568 బోధనా సిబ్బంది, 138 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. 2018లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేసినప్పటికీ.. ఉద్యోగుల విభజన జరగలేదు. ఇటీవల ప్రభుత్వం 317 జీవో ద్వారా కొత్త జిల్లాల్లో నూతన జోనల్ వ్యవస్థ ఆధారంగా బదిలీ ప్రక్రియ ప్రారంభించింది. అయితే నూతన మార్గదర్శకాల ప్రకారం.. సీనియారిటీ ఎక్కువ ఉన్నవారికి కోరుకున్న చోటికి బదిలీ చేసేందుకు వెసులుబాటు ఉండటంతో తక్కువ సర్వీస్ ఉన్నవారు నష్టపోతున్నారు. ఫలితంగా స్థానికతను కూడా కోల్పోయే ప్రమాదం నెలకొంది. జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో బదిలీ ప్రక్రియ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొత్త జిల్లాలవారీగా టీచింగ్ పోస్టుల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, పీఈటీలు ఉన్నారు. బోధనేతర సిబ్బందిలో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు, క్లర్క్ కం టైపిస్టులు, అటెండర్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు ఉన్నారు. జోనల్ పోస్టుల్లో సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ ఉండగా, మల్టీ జోనల్లో బోధన సిబ్బందిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 హెడ్మాస్టర్లు, బోధనేతర సిబ్బందిలో అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు.
మారిన జోన్లతో కన్ఫ్యూజన్
కొత్తగా ఏర్పాటైన జోన్ల ప్రకారం.. మెదక్, సిద్దిపేట జిల్లాలు మూడో జోన్లో ఉండగా.. సంగారెడ్డి జిల్లా ఆరో జోన్లో ఉంది. మల్టీ జోనల్ ప్రకారం.. మెదక్, సిద్దిపేట జిల్లాలు ఒకటో జోన్లో ఉండగా.. సంగారెడ్డి జిల్లా రెండో జోన్లో ఉంది. జోనల్ స్థాయిలో పరిశీలిస్తే సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట ప్రాంతం ఆరో జోన్లో ఉన్నది. ఇక ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోని ప్రాంతాలు ఐదో జోన్లో ఉన్నాయి. బదిలీల్లో ప్రత్యేక కేటగిరి కింద 70 శాతం వైకల్యం ఉన్న వికలాంగులకు, కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం చేస్తున్న వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
పని ప్రాంతంలో సీనియార్టీతో నష్టమే..
నూతన జోన్ల ప్రకారం జరుగుతున్న టీచర్ల బదిలీల్లో పనిచేసే ప్రాంతంలో సీనియార్టీని లెక్కిస్తున్నారు. వారు పుట్టిన ప్రాంతం ఆధారంగా స్థానికతను లెక్కచేయకపోవడంతో కొంత మందికి నష్టం కలుగుతుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రో రేటా విధానంలో ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే.
-సాయిలు, టీఎస్ యూటీఎఫ్
సంగారెడ్డి జిల్లా కార్యదర్శి
మార్గదర్శకాలు జారీ చేయాలి
ప్రో రేటా విధానం ద్వారా ఎక్కువ నష్టపోయేది భావితరాల టీచర్లే. ప్రస్తుతం ఖాళీలున్న చోటికి ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయు లను సర్దుబాటు చేస్తున్నారు. దీనివల్ల సదరు జిల్లాలో నూతన నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ కోటా పోస్టులు తగ్గి అభ్యర్థులు నష్టపోతారు. ఇక ప్రభుత్వం 317 ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపు విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయాలి. స్థానికత, సీనియారిటీ ఆధారంగానే ఉపాధ్యాయుల జిల్లా కేటాయింపులు జరగాలి. 317 ఉత్తర్వులననుసరించి విద్యాశాఖలోని ప్రత్యేక పరిస్థితులకనుగుణంగా సంచాలకులు మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఉపాధ్యాయుల క్యాడర్లు, సబ్జెక్టుల ప్రకారం సీనియారిటీ జాబితాలను సబార్డినెట్ సర్వీస్ రూల్స్ లోని 33, 34, 35, 36 నిబంధనల ప్రకారం రూపొందించి ప్రకటించాలి.
- సోమశేఖర్, టీపీటీఎఫ్,
సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి