Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిభవన్ ఎదుట పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే యత్నం
- వెంటనే అడ్డుకున్న పోలీసులు
- పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- కౌన్సెలింగ్ అనంతరం కేసు నమోదు
నవతెలంగాణ- బంజారాహిల్స్
తమ ఐదెకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుంజుకున్నారని, నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని సీఎం అధికార నివాసం ప్రగతిభవన్ వద్ద శనివారం మధ్యాహ్నం ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే గమనించి అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి..రంగారెడ్డి జిల్లా ఇంబ్రహీంపట్నం మండలం, నాదర్గుల్ గ్రామానికి చెందిన ఎల్లేష్- అనురాధ దంపతులు. వీరికి గ్రామంలో ఐదెకరాల పొలం ఉంది. ఇటీవల అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఎన్ఎస్జీకి బదలాయించింది. బాధితులకు ఎటువంటి పరిహారమూ చెల్లించలేదు. తమకు పరిహారం రావాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అటు పోలీసుల్లో, ఇటు రెవెన్యూ అధికారుల్లో చలనం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ సమస్యను చెప్పుకుందామని శనివారం ఎల్లేశ్- అనురాధ దంపతులు తమ పిల్లలు అక్షిత మనీష్తేజ్, వేణు తేజ్‌తో కలిసి ప్రగతిభవన్‌కు వచ్చారు. ప్రగతిభవన్ ఎదుట రోడ్డుపై వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. డ్యూటీలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అడ్డుకున్నారు. బాధితులను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.