Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ ఉక్కిరిబిక్కిరి
- సమాధానం చెప్పలేక విజయలక్ష్మి వాకౌట్
- మేయర్ తీరుపై అధికార,ప్రతిపక్ష సభ్యుల అసంతృప్తి
- ఇదీ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం తీరు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వాడీవేడిగా జరిగింది. శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన రెండో సాధారణ సర్వసభ్య సమావేశం ఆందోళనల మధ్య సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అసహనానికి గురైన మేయర్ సమావేశాన్ని వాకౌట్ చేసి బ్రేక్ కావాలని వెళ్లిపోయారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలే చెప్పలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సమాధానాలు చెప్పకుండా.. రాతపూర్వకంగా ఇంటికి పంపిస్తామని మేయర్ చెప్పడాన్ని సభ్యులు తప్పుబట్టారు. ఇంటికి సమాధానాలు పంపిస్తే కౌన్సిల్ సమావేశమెందుకని ప్రశ్నించారు. కరోనా సమయంలో శ్మశానవాటికల్లో ఎంత మందిని ఖననం చేశారు? ఎంత మందిని పూడ్చి పెట్టారు? క్రిమియేషన్ లెక్కలు చెప్పాలని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మేయర్, కమిషనర్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఖచ్చితమైన మరణాల లెక్క చెప్పలేమని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ అన్నారు. శ్మశాన వాటికల నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై దృష్టి సారిస్తామని చెప్పారు. గ్రేటర్లో రోడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని, డ్రయినేజీ, నాలాల పనులు ఎక్కడికక్కడే పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు చేయడం లేదని సభ్యులు నిలదీశారు. దానికి, గ్రేటర్లో పన్నులు సరిగ్గా వసూలు కాకపోవడంతో నిధుల్లేక బిల్లులు చెల్లించలేకపోతున్నామని, త్వరలోనే చెల్లిస్తామని కమిషనర్ చెప్పారు. ఈ విషయంపై బీజేపీ సభ్యులు మాట్లాడుతూ.. సెంట్రల్ ఫైనాన్స్ నిధులేమయ్యాయని నిలదీశారు. దానికి మేయర్ అనుమతిస్తే సమాధానం చెబుతానని కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. సమాధానం చెప్పడానికి మేయర్ అనుమతివ్వలేదు.గ్రేటర్లో అక్రమ నిర్మాణాలు విచ్చిలవిడిగా పుట్టుకొస్తున్నాయని, టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశుధ్య నిర్వహణ సరిగ్గాలేదని, స్వీపింగ్ మిషన్లు పనిచేయడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కౌన్సిల్ సమావేశంలోనూ సమాధానాలు రావడం లేదని నిలదీశారు. దోమల నియంత్రణ, తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించారు. కరోనా థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకున్నారని సభ్యులు ప్రశ్నించారు. రోజువారీగా ఎంటమాలజీ విభాగం చేస్తున్న కార్యక్రమాలను అధికారులు ఏకరువు పెట్టారు.