Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-చింతకాని
ప్రకృతి వైపరీత్యంతో మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో పంట నష్టాన్ని విపత్తుగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20న ఖమ్మం కలెక్టరేట్ ముందు నిర్వహించనున్న చలో ధర్నాలో రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ, నాగిలిగొండ గ్రామాల్లో నష్టపోయిన మిర్చి తోటలను శనివారం సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో మిర్చి తోటలు వైరస్ బారిన పడి పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని, లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు అప్పులపాలై దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఇప్పటివరకు దెబ్బతిన్న పంటల వైపు కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు రాలేదంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆందోళన చేపట్టనుందని, రైతు సోదరులందరూ ఆ ఆందోళనలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సాయం అందేలా కొట్లాడుదాం అన్నారు. ప్రతి రైతుకూ ఎకరానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ బృందంలో సీపీఐ(ఎం) మధిర డివిజన్ కన్వీనర్ చింతలచెరువు కోటేశ్వరరావు, నాయకులు మడిపల్లి గోపాల్రావు, వత్సవాయి జానకి రాములు, తోటకూర వెంకట నరసయ్య, నన్నక కృష్ణమూర్తి, మద్దిని బసవయ్య, ఆలస్యం రవి, గడ్డం రమణ, లింగం కోటేశ్వరరావు, దేశబోయిన ఉపేందర్, గంటల స్వామి, దాసు ఉన్నారు.