Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్చి రైతుకు తెగుళ్ల తిప్పలు
- వేలాది ఎకరాల్లో తోటల తొలగింపు
- ఎకరానికి రూ.లక్షకు పైగా నష్టం
- పరిహారం కోసం రేపు సీపీఐ(ఎం) చలో కలెక్టరేట్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆకులు, పువ్వులు, కాయలు దేన్నీ వదలకుండా పీల్చిపిప్పి చేస్తున్న తామర పురుగు ఉధృతికి మిర్చి తోటలు విలవిల్లాడుతున్నాయి. అమెరికాలోని హవాయి, ఫ్లోరిడా నుంచి వ్యాప్తి చెంది దేశంలోని కర్ణాటక, కేరళ మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చేరిన తామర నల్లితో రైతులు తంటాలు పడుతున్నారు. మొత్తం మొక్కనే గుళ్ల చేసే ఈ పురుగుతో వేలాది ఎకరాల్లో మిర్చి తోటలను రైతులు తొలగిస్తున్నారు.
''ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన మిర్యాల విక్రమ్‌రెడ్డి బీ ఫార్మసీ పూర్తి చేశాడు. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుని పదేండ్లుగా మిర్చి, పత్తి తదితర వాణిజ్య పంటలు వేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. గ్రామంలో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును కూడా నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది భూమి కౌలుకు తీసుకుని 15 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. ఏపుగా ఎదిగిన తోట పూత, పిందె దశకు వచ్చిన సమయంలో తామర నల్లి ఆశించింది. దీనికి వేరుకుళ్లు కూడా తోడైంది. అనేక రకాల పరుగు మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో మిర్చి తోటను మొత్తం తొలగించి.. దాని స్థానంలో మొక్కజొన్న నాటాడు. ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలు నష్టపోయానని రైతు విక్రమ్‌రెడ్డి వాపోతున్నాడు. ఇది ఈ ఒక్క రైతు పరిస్థితే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా తెగుళ్ల దెబ్బ
రాష్ట్రవ్యాప్తంగా 3,58,557 ఎకరాల్లో మిరప సాగు చేసిన రైతులందరూ.. తోటలకు తామరనల్లి, వేరుకుళ్లు రకరకాల వైరస్లు సోకడంతో తీవ్రంగా నష్టపోయారు. గతేడాది 2.40 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, ఈ ఏడాది అదనంగా 1.10 లక్షల ఎకరాల్లో వేశారు. సాధారణంగా మిర్చి ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రాష్ట్రంలో 7 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అంచనా. కానీ తామర పురుగు దెబ్బతో ఆ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఖమ్మం జిల్లాలో 1,03,021 ఎకరాల్లో పంట సేద్యం చేయగా, 90% తోటల్లో ఈ తెగుళ్ల ఉధృతి ఉంది. 50% తోటలపై రైతులు ఆశలు వదులుకున్నారు. దీనిలో ఓ పది శాతం వరకు తోటలను ఇప్పటికే తొలగిస్తున్నారు. ఉద్యానశాఖ వద్ద ఈ తొలగింపునకు సంబంధించి స్పష్టమైన సమాచారం లేదు. కానీ జిల్లా వ్యాప్తంగా ఓ పదివేల ఎకరాల వరకు తొలగిస్తున్నట్టు చెబుతున్నారు. నెలన్నర కిందట తామర నల్లి వ్యాప్తికి ముందు కొన్ని తోటల్లో పూత, పిందె దశ పూర్తయింది. ఇప్పుడాకాయలు పండుతున్నాయి. వీటి కోత పూర్తయితే 50%కు పైగా మిరప తోటలను రైతులు తొలగించే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పుడిప్పుడే ఈ తామర పురుగు ఇతర పంటలకూ వ్యాపిస్తోంది. కూరగాయ తోటలు కూడా ఈ నల్లి బారిన పడుతున్నాయి. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ, బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తలు ఈ తామర నల్లికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఆరుగురు మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) బృందం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తోటలను సందర్శిస్తోంది. ప్రభుత్వంపై పోరాడి రైతులకు ఎకరానికి రూ.లక్ష పరిహారంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు విత్తనాలు ఇప్పిస్తామని రైతాంగంలో మనోధైర్యం కల్పిస్తోంది. సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సిద్ధమవుతోంది.
వేగవంతంగా ఉత్పత్తి.. వ్యాప్తి
ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా తామర పురుగు వ్యాప్తి మాత్రం అదుపులోకి రావడం లేదు. రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో మిర్చి తోటలు తామ పురుగు ఉధృతికి దెబ్బతిన్నాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన ఈ తామర పురగు శాస్త్రీయ నామం స్కిర్టోత్రిప్స్ డోర్సాలిస్ హుడ్. అమెరికాలోని ఫ్లోరిడా, హవాయి ప్రాంతం నుంచి మనదేశంలోకి ప్రవేశించిన తామర పురుగు వేగవంతంగా వ్యాప్తి చెందుతోంది. రెండు వారాల్లోపే గుడ్లపై పొదిగి పిల్లలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మందులు పిచికారీ చేసిన సమయంలో పువ్వుల్లోకి ఆకు కింది భాగం, నేల పొరల్లోకి వెళ్లి పురుగు మందు ప్రభావం తగ్గిన తర్వాత యథావిధిగా మొక్కలపైకి చేరుతుందని తెలిపారు. తామర పురుగుతో పాటు వేరు పురుగు, తెల్లదోమ, పచ్చ పురుగు, రబ్బరు పురుగుల ప్రభావంతోనూ ఖమ్మం జిల్లాలోని మిర్చి తోటలు దెబ్బతింటున్నట్లు ఉద్యానశాఖ గుర్తించింది. తామర పురుగు నివారణకు ఉదయం, సాయంత్రం వేళల్లో రైతులందరూ ఏకకాలంలో మందులు పిచికారీ చేస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుందంటున్నారు.
నాలుగైదురోజులకోసారి మందు పిచికారీ చేయాలి
తామర పురుగులు పూతను ఆశించి పూరెక్కలు తిని, పూత మాడిపోయేలా చేస్తున్నాయి. చాలా మంది రైతులు ఇవి నల్లులుగా భావించి మందులు పిచికారీ చేస్తున్నారు. వీటి నివారణకు ఫిప్రోనిల్ 80% డబ్ల్యూజీ 0.2 గ్రాముల అసిటామిడ్రిడ్ 0.2 గ్రా., ఇమిడా క్లోప్రిడ్ + ఫిప్రోనిల్-0.2 గ్రా/ సయాంట్రినిలిప్రోల్ 1.2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి మార్చి నాలుగైదు రోజుల వ్యవధికోసారి పిచికారీ చేస్తే ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.
- కాసాని రుక్మిణి, డాట్ సెంటర్ సైంటిస్ట్, వైరా