Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ.. పన్నుల రూపంలో 32లక్షల కోట్లు దోచుకుండ్రు
- నిత్యావసర ధరలపై ప్రభుత్వాలను నిలదీయాలి: రేవంత్‌రెడ్డి
- టీపీసీసీ పాదయాత్రలో మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్
నవతెలంగాణ- చేవెళ్ల
నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి, పన్నుల రూపంలో ప్రజల సొమ్మును దోచుకోవడంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ తోడు దొంగలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ 7ఏండ్లలో పన్నుల రూపంలో ప్రజల నుంచి రూ.32లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నిత్యావసర ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల్లో ప్రారంభమైన పాదయాత్ర కుమ్మెర, మల్కాపూర్ మీదుగా చేవెళ్ల వరకు సాగింది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ జాతీయ స్థాయిలో నిరసనలు చేపట్టినట్టు తెలిపారు. చేవెళ్ల కాంగ్రెస్‌కు అచ్చోచింది.. అందుకే ఇక్కడి నుంచి పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. ఈ పాదయాత్ర ఇక్కడితో ఆగకుండా భవిష్యత్‌లోనూ కొనసాతుందన్నారు. 2014లో 60 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ఇప్పుడు రూ.108 లీటర్ అయిందన్నారు. వంట గ్యాస్ గతంలో రూ.400 ఉంటే సుమారు వెయ్యికి చేరిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేతిలో డబ్బులు ఉంటే సంచి నిండా సరుకులు వచ్చేవని, ఇప్పుడు సంచిలో డబ్బు తీసుకొని పోతే చేతిలో సరుకులు వస్తున్నాయని అన్నారు. మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి, నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన అంటున్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేస్తే చేవెళ్లను తొలగించి ఇక్కడ రైతులను అన్యాయం చేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనే వరకూ కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.
కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు పొందిన వారిని అభివృద్ధి విషయంలో నిలదీయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 111జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. 111జీవో పరిధిలో మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ కట్టుకుంటే ఎలాంటి చర్యలూ తీసుకోని ప్రభుత్వం, పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం కూల్చేసి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. టీఆర్ఎస్ చెరువుకు గండి పడిందిని, ఇక ఆ పార్టీకి చేవెళ్ల బస్టాండే గతి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, మల్లు రవి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, చింపుల సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్లు దేవర వెంకట్‌రెడ్డి, గొనె ప్రతాప్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు బండారు శైలజారెడ్డి, రమేష్‌గౌడ్, సీనియర్ నాయకులు సున్నపు వసంతం, ఎంపీటీసీ రాములు, చేవెళ్ల మండల యూత్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, నాయకులు మహేశ్వర్ రెడ్డి, కోరె రాజు తదితరులు పాల్గొన్నారు.