Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటి శక్తి తక్కువేం కాదు..
- హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రారంభంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- పుస్తకాల పండుగ షురూ.. 28 వరకు నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం పుస్తకాల పండుగ ఘనంగా ఆరంభమైంది. తెలంగాణ కళాభారతి ( ఎన్టీఆర్ స్టేడియం) వేదికగా34వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను బోనాలు, కోలాటాలు, నృత్యాల మధ్య సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షత జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది పుస్తకమేనని చెప్పాడు. ప్రొఫెసర్ జయశంకర్ రాసిన పుస్తకాలు ఉద్యమానికి ఊతమిచ్చాయని తెలిపారు. పుస్తకాల శక్తి తక్కువది కాదని పలు అనుభవాలను వివరించారు. సీఎం అవ్వడానికీ, ప్రాణాలు తెగించే ఉద్యమం చేయడానికి పుస్తకం ప్రధాన పాత్ర పోషించిందన్నారు. పుస్తకం అంటే ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పారు. చరిత్ర అంతా పుస్తకాల్లోనే నిక్షిప్తమై ఉందన్నారు. ఎందరో మహానుభావుల జీవితాలూ, వారి త్యాగాల గొప్పతనం పుస్తకాలద్వారానే తెలుస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ పుస్తకాలను విధిగా చదవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిందనీ, సెల్ పోన్ వాడకం పెరిగిందన్నారు. ఈ కల్చర్‌తో యువతరం సమయాన్ని వృథా చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ పుస్తకాలు కూడా అందుబాటులో వచ్చాయనీ, అందువల్ల పుస్తకాల పట్ల ఆదరణ ఆనాడైనా ఈనాడైనా ఉంటుందని పేర్కొన్నారు. రవీంద్రభారతిలో నిరంతర పుస్తక ప్రదర్శన ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ పుస్తక ప్రియులకు బుక్ ఫెయిర్ పెద్ద పండుగన్నారు. పుస్తకాన్ని ప్రేమించేవారు ఎవరినీ ద్వేషించబోరని తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రపంచ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది కోవిడ్ కారణంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను నిర్వహించలేక పోయామన్నారు. గౌరీశంకర్ మాట్లాడుతూ ఈ ఏడాది 260 స్టాల్స్‌తో హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పుస్తక పఠనం వలన వివేచన, మంచి ఆలోచన కలుగుతుందన్నారు. బుక్‌ఫెయిర్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కారక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారితో పాటు బుక్‌ఫెయిర్ కోశాధికారి పి.రాజేశ్వర్ రావు, సహాయ కార్యదర్శి శోభన్‌బాబు, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, సృతికాంత్ భారతి తదితరులు పాల్గొన్నారు.