Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్,మీడియేషన్ కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. భారత దేశంలో ఆర్బిట్రేషన్, మీడియేషన్ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉందనీ, అన్ని కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ఇది ప్రోత్సహిస్తుందని చెప్పారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని శనివారం జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేెఐ మాట్లాడుతూ, ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే కేసీఆర్ అంగీకరించారన్నారు. తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటుకు కృషి చేసిన అధికారులకు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీవీ రవీంద్రన్ ఈ కేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపారని సీజే తెలిపారు. అతి తక్కువ వ్యయంతో స్వల్ప సమయంలో వివాదాల పరిష్కారమే ఆర్బిట్రేషన్ సెంటర్ లక్ష్యమనీ, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాల అనుకూలమని తెలిపారు. వివాదాల రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర వహిస్తుందని సీజేెఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
సీజేెఐది కీలక పాత్ర : సీఎం కేసీఆర్
అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా హైదరాబాద్ పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారని చెప్పారు. భాగ్యనగరాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అని కేసీఆర్ వివరించారు. ఐఏఎంసీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశానికీ, రాష్ట్రానికి ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య నెలకొనే వివాదాలను ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించేలా చట్ట సవరణ చేసేందుకు న్యాయమూర్తులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీవీ రవీంద్రన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, కేటీిఆర్, శ్రీనివాస్ గౌడ్, సీిఎస్, డీజీపీ, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు.