Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్త్రీల అభివృద్ధిని అడ్డుకుంటున్న పాలకులు
- సమాజంలో సైద్ధాంతిక మార్పు అవసరం: ఐద్వా సెమినార్లో రచయిత డాక్టర్ శిలాలోలిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠ్యాంశాల్లో మనువాద భావజాలం ఉండడం దేశానికే ప్రమాదకరమని రచయిత డాక్టర్ శిలాలోలిత అన్నారు. ప్రాచీన కాలం నుంచి పురుషులకు మహిళలంటే చులకన భావం ఉందన్నారు. పాలకులూ స్త్రీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. వారి పట్ల సమాజంలో సైద్ధాంతికంగా మార్పు ఎంతో అవసరమనీ, కుటుంబం నుంచే ఇది ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'విద్యావ్యవస్థలో మనువాద భావజాలం'అనే అంశంపై శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ జరిగింది. ముఖ్యవక్తగా హాజరైన శిలాలోలిత మాట్లాడుతూ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ పాఠ్యపుస్తకాల్లోనూ మనువాద భావజాలం నిండి ఉంటుందని చెప్పారు. ప్రాచీన సాహిత్యమంతా మహిళలు ఇలాగే ఉండాలని శాసించి, అలాగే బతకాలంటూ రాశారని అన్నారు. ఇటీవల స్త్రీని తక్కువ చేసి అవమానపరిచేలా సీబీఎస్ఈ ప్రశ్నాపత్రంలో పొందుపరిచిందని విమర్శించారు. మహిళలను ఇంకా వస్తువుగానే గుర్తిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యవస్థకు ప్రతిరూపం మనువు అని అన్నారు. కరోనాకు శరీరం లేనట్టే మనువుకూ లేదన్నారు. ప్రస్తుత సమాజమంతా మనువాద భావజాలం వ్యాపించి ఉందని వివరించారు. ఇలాంటి భావజాలం పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలనీ, చైతన్యవంతంగా తయారు కావాలని కోరారు. పిల్లల పెంపకంలో, సైద్ధాంతికంగా మార్పు తేవాలనీ సూచించారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల హైమావతి మాట్లాడుతూ సీబీఎస్ఈలో వివిధ స్థాయిల్లో అధికారులు పరిశీలించిన తర్వాతే ప్రశ్నాపత్రాలను రూపొందిస్తారని చెప్పారు. మహిళలను కించపరిచేలా ఛాందస భావజాలాన్ని సీబీఎస్ఈ ప్రశ్నాపత్రంలో ఇవ్వడం సరైంది కాదని విమర్శించారు. ఆధునిక సమాజంలో మహిళల గౌరవాన్ని తగ్గించే ప్రశ్నలుండడం అన్యాయమని అన్నారు. ఛాందస భావజాలం ఉన్న వారు సీబీఎస్ఈలో ఉంటే ఆధునిక భారతదేశంగా ఎలా మారుతుందని ప్రశ్నించారు. కర్నాటక అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. వారి పోరాటాలను, చైతన్యాన్ని, అభ్యుదయ భావాలను అణచివేసే కుట్ర జరుగుతుందన్నారు. మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలనీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆగడాలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. సమానత్వం కోసం హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షత వహించిన ఈ సెమినార్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సీనియర్ నాయకులు టి జ్యోతి, ఆఫీస్ బేరర్లు కెఎన్ ఆశాలత, బుగ్గవీటి సరళ, ఇందిర, సమీనా అఫ్రోజ్, ప్రభావతి, అనురాధ, వినోద, నాగలక్ష్మి, మహేశ్వరి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.