Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది దుర్మరణం
- కామారెడ్డిలో లారీని ఢకొీన్న క్వాలీస్
- ఆరుగురు అక్కడికక్కడే మృతి
- రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ముగ్గురు..
- హన్మకొండలో ముగ్గురు కార్మికులు
నవతెలంగాణ-బిచ్కుంద/మియాపూర్/కాజీపేట
రహదారులు నెత్తురు పీల్చాయి.. 9 మంది ప్రాణాన్ని తీసుకున్నాయి.. పసికందునూ వదల్లేదు.. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేశాయి.. జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలనుకున్న ముగ్గురు యువతీ యువకులు చనిపోయారు. హన్మకొండ క్వారీలో టిప్పర్ బోల్తాపడి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మొత్తంగా శనివారం జరిగిన మూడు ప్రమాదాల్లో 12 మంది మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం చిన్నతక్కడ్పల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా క్వాలీస్ ఢకొీంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణం వదిలారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురున్నారు. మరో కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. దైవ దర్శనం చేసుకొని వస్తుండగా ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో నివాసముంటున్న బంధువులైన రెండు కుటుంబాల వారు మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని కాందార్ దర్గా దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారి క్వాలిస్ వాహనం వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని బలంగా ఢకొీంది. ఈ ఘటనలో చాదర్‌ఘాట్‌కు చెందిన అమీర్‌తాజ్(30), ఆయన భార్య సనా ఫాతిమా(28), వారి పిల్లలు హనియా(2), హన్నాఫ్(4 నెలలు), ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ హుస్సేన్(35), ఆయన భార్య తస్లింబేగం(30) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని వెంటనే బాన్సువాడ, నిజామాబాద్‌లోని పలు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి, బిచ్కుంద సీఐ శోభన్, పలువురు ఎస్ఐలు పరిశీలించారు.
గచ్చిబౌలిలో చెట్టును ఢీకొట్టిన కారు
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్డులో శనివారం తెల్లవారుజామున కారు చెట్టును బలంగా ఢకొీట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం ప్రాంతానికి చెందిన సాయి సిద్దూ, మరో యువకుడు ప్రసాద్‌తో కలిసి గచ్చిబౌలి జేవీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నారు. సిద్దూ టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌ల్లో యాక్టింగ్ చేస్తున్నాడు. విజయవాడ గునదల ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రహీం(24) అమీర్‌పేట్‌లోని ఓ ప్రయివేటు హాస్టల్లో ఉంటూ మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నాడు. అబ్దుల్ రహీం, సాయి సిద్దూ మిత్రులు. బెంగళూరు గంగాధరాపుర ప్రాంతానికి చెందిన ఎన్.మానస(22) షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్టింగ్ చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదెపల్లి గ్రామానికి చెందిన ఎం. మానస(19) ఇంటర్ వరకు చదివి షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరిస్‌ల్లో యాక్టింగ్ చేస్తుంది. ఎం.మానస షూటింగ్ కోసం గురువారమే హైదరాబాద్‌కు వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి అబ్దుల్ రహీం, ఎన్.మానస, ఎం.మానస గచ్చిబౌలిలోని జూనియర్ అర్టిస్టు సిద్దూ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తెల్లవారుజామున చారు తాగడానికి లింగంపల్లి వైపు వెళ్లారు. మద్యం మత్తులో అతివేగంతో కారు డ్రైవ్ చేయడంతో హెచ్‌సీయూ వద్ద చెట్టును ఢకొీట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్లో ఉన్న రహీం, ఎన్.మానస, ఎం.మానస మృతిచెందారు. సిద్ధూ తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిద్దూని గచ్చిబౌలిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మద్యం మత్తులో అతివేగంతో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు.
క్వారీలో టిప్పర్ బోల్తా
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం, తరాలపల్లి శివారులోని శ్రీలక్ష్మీ గ్రానైట్‌లో శనివారం తెల్లవారుజామున టిప్పర్ బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. గ్రానైట్ తవ్వకాల్లో తీసిన బండరాళ్లను టిప్పర్ లారీలతో డంపు చేస్తున్నారు. ఈ సమయంలో డంపు చేస్తున్న ఓ లారీలో డ్రైవర్ ముఖేష్(22), హెల్ప్ డ్రైవర్ హకీం(23), మరో కార్మికుడు చిత్రం చందు(21) ఉన్నారు. రాళ్లను పక్కకు పోస్తుండగా లారీ అదుపుతప్పి లోతట్టు ప్రాంతంలో పడింది. ఈ ఘటనలో చందు, ముఖేష్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన హకీంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. చందుది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, ముఖేష్‌ది గూడూరు, హకీం బీహార్ ప్రాంతానికి చెందిన వారు. చందు సోదరుడు హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు శ్రీ లక్ష్మీ గ్రానైట్ యజమానిపై మడికొండ సీఐ రవికుమార్ కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.