Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 నుంచి అన్నదాతల ఖాతాల్లో
- ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
- యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనేది లేదు
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవు
- కలెక్టర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
- నూతన జోనల్ విధానం ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
- వెనుకబడిన ప్రాంతాలకు వారు వెళితేనే సమగ్రాభివృద్ధి
- భార్యాభర్తలు ఒకే చోట ఉండేలా ఉద్యోగుల విభజన
- స్థానిక యవతకు పెద్ద పీట
- ఒమిక్రాన్ గురించి ఆందోళనొద్దు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగి కోసం రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని ఈనెల 28వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం కేసిఆర్ తెలిపారు. గతంలో మాదిరిగానే ప్రారంభించిన వారం పది రోజుల్లో వరుస క్రమంలో అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం... తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినేలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్రం పదే పదే చెబుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. అందువల్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోవడం లేదన్నారు. ఇది బాధ కలిగించే అంశమే అయినా కేంద్రం మొండి వైఖరివల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయని సీఎం తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జిల్లాల కలెక్టర్లతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దళిత బంధు అమలు, దాని పురోగతి, తీరుతెన్నులు, రాష్ట్రవ్యాప్తంగా అమలుకోసం చేపట్టాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో కేంద్రం మొండి వైఖరి, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ, జోన్ల వారీగా ఉద్యోగుల విభజన, రైతు బంధు నిధుల విడుదల, కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి తదితరాంశాలపై ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత కలెక్టర్లకు, అధికారులకు ందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అందులో భాగంగా... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాసంగి వడ్లను కొనడం లేదనే విషయాన్ని రైతులకు అర్థం చేయించాల న్నారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆహార భధ్రత కల్పించడం కోసం రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన ఎఫ్సీఐ... ఉప్పుడు బియ్యం పేరుతో యాసంగిలో మన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పటం శోచనీయమన్నారు. భారత ఆహార సంస్థ నిర్లక్ష్యం వల్ల గోదాముల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి.. అవి మగ్గిపోతున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే వానాకాలం పంటల సాగు కోసం ఏయే పంటలు వేయాలనే అంశంపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలంటూ సీఎం వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు సూచించారు. రైతులు పత్తి, కంది, వరి సాగుపై దృష్టి సారించేలా చూడాలని కోరారు.
దళితబంధు కోసం ఒక్కో నియోజకవర్గంలో వంద మంది ఎంపిక...
దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయల సాయం, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారతుందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయటానికి ఇది దోహద పడుతుందని ఆయన అన్నారు. ముందుగా ప్రకటించిన విధంగా హుజూరాబాద్ నియోజకవర్గం తో పాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు జిల్లాల నుంచి నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును సంతృప్త స్థాయిలో అమలు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేసే కార్యాచరణను ప్రారంభించాలని కలెక్టర్లను, అధికారులను అదేశించారు. ఇందుకుగాను స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలన్నారు.
నూతన జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా కలెక్టర్లకు సూచించారు. స్థానిక ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్న ఆ విధానం నియమ నిబంధనల ప్రకారమే వారి విభజనను చేపట్టాలని సూచించారు. ఉద్యోగులైన భార్యాభర్తలకు ఒకేచోట పనిచేసే అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. నూతన జోనల్ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యో గాల కల్పనతోపాటు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాలన అమల్లోకి కేసీఆర్ తెలిపారు. వెనుకబడిన మారు మూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నాలు గైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. భార్యాభర్తలైన ఉద్యో గులు (స్పౌస్ కేస్) ఒకే చోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని చెప్పారు. వారి పనితీరు కూడా మెరగుపడతుందని తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఒమిక్రాన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని సీఎం తెలిపారు. అయితే తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యశాఖ అధికారులు సీఎంకు తెలిపారు. దాని నిరోధానికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించిన ముఖ్యమంత్రి... అధికారులకు దిశా నిర్దేశం చేశారు.