Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- కోహిర్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు
- రాష్ట్రం మీదుగా వీస్తున్న చల్లని గాలులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చలి గజగజా వణికిస్తున్నది. రాష్ట్రంమీదుగా కిందిస్థాయిలో వీస్తున్న చల్లటి గాలుల ప్రభావంగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో చలితీవ్రత బాగా పెరుగుతున్నది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో కూడా రాత్రి పూట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సంగారెడ్డి, కొమ్రం భీమ్, నారాయణపేట, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పది డిగ్రీల కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీచేసింది. వచ్చే రెండు, మూడు రోజులు 25 జిల్లాల్లో పది డిగ్రీలకు లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం నాడు సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 7.1 డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అల్గోల్(సంగారెడ్డి) 8.1, మర్పల్లి(వికారాబాద్)8.1, కాసులాబాద్(రంగారెడ్డి జిల్లా) 8.5, రెడ్డిపల్లి(రంగారెడ్డి)8.5, సత్వార్(సంగారెడ్డి) 8.9, చందనవల్లి(రంగారెడ్డి) 8.9, అమ్రాబాద్(నాగర్కర్నూల్)9.3, నల్లవల్లి(సంగారెడ్డి) 9.4, సిర్పూర్(కొమ్రంభీమ్) 9.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో నాలుగైదు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.