Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంచిన ఆయకట్టుకే నీటి కేటాయింపులు
- కృష్ణా బోర్డు చైర్మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కొత్తగా ఆయకట్టు పెంచలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన ఆయకట్టుకు సరిపడా నీటి కేటాయింపులు చేసినట్టు పేర్కొంది. ఈమేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబీ) చైర్మెన్‌కు తెలంగాణ సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్ ఆదివారం లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండు కాంపోనెంట్లుగా గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరి చారనీ, వాటిని ఒకే కాంపోనెంట్గా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కృష్ణా బోర్డును కోరింది. కల్వకుర్తి ఎత్తిపోతల రెండో కాంపోనెంట్‌ను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీల వరకు పెంచినట్టుగా గెజిట్‌లో పేర్కొనడాన్ని తప్పుబట్టింది. నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచింది కానీ.. ఆ మేరకు నీటి కేటాయింపులు చేయలేదని పేర్కొంది. శ్రీశైలం రిజర్వాయిర్ నుంచి 800 అడుగుల వద్ద కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నీటిని తీసుకునే విధంగా 2006లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించిన డీపీఆర్‌లోనే ఉందన్నారు. అదే సమయంలో ఎఫ్ఆర్ఎల్ 885 అడుగుల వద్ద నీటిని తీసుకునే విధంగా జీఎన్ఎస్ఎస్, వెలుగొండ, హంద్రీనీవా, టీజీపీ ప్రాజెక్టులను డిజైన్ చేసినట్టు ఏపీ ప్రభుత్వం తెలియజేసిందని పేర్కొన్నారు. కల్వకుర్తి కృష్ణా నది బేసిన్‌లోని ప్రాజెక్టు కాబట్టే 800 అడుగుల వద్ద డిజైన్ చేసినట్టు తెలిపారు. నికర జలాలను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి కేటాయించాలని కృష్ణా వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ 2 ను తెలంగాణ ప్రభుత్వం కోరిందని..ఆంధ్రప్రదేశ్ మాత్రం జిఎన్ఎస్ఎస్, వెలుగొండ, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు మిగులు జలాల కేటాయింపు మాత్రమే కోరిందని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలనీ, గెజిట్ నోటిఫికేషన్ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేసింది.