Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుక్‌ఫెయిర్ సందర్భంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ఎమ్డీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఇచ్చే టీ-24 టిక్కెట్ ధరపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ప్రస్తుతం టీ-24 టిక్కెట్ ధర రూ.100 కాగా, పుస్తక ప్రదర్శన సందర్భంగా 20 శాతం డిస్కౌంట్‌తో రూ.80కే అన్ని ఆర్టీసీ బస్సుల్లోని కండక్టర్ల వద్ద లభిస్తుందని తెలిపారు. టిక్కెట్ తీసుకున్న సమయం నుంచి 24 గంటల పాటు డీలక్స్ బస్సుల వరకు సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. పుస్తక ప్రియులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్డీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ రూట్లో బస్సుల సంఖ్యను పెంచాలని బుక్ ఫెయిర్‌కి వస్తున్న విద్యార్ధులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంధన పొదుపులో ఆర్టీసీకి అవార్డులు
ఇంధన పొదుపులో టీఎస్ఆర్టీసీకి అవార్డులు లభించాయి. తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏటా ఇచ్చే ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్-2021లో బంగారు, వెండి పతకాలను సంస్థ సాధించింది. ఆదివారంనాడిక్కడ జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీ వినోద్‌కుమార్, సత్తుపల్లి డిపో మేనేజర్ జేవీ బాబు బంగారు పురస్కారాన్ని అందుకున్నారు. చీఫ్ మెకానిక్ ఇంజనీర్ టీ రఘునాథరావు, గోదావరిఖని డిపో మేనేజర్ వెంకటేశం రజత పురస్కారాన్ని అందుకున్నారు. టీఎస్ఆర్టీసీకి అవార్డులు రావడం పట్ల రవాణామంత్రి పువ్వాడ అజరుకుమార్, చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పారు.