Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రణదీవె పేరులోనే రణం, దివిటీలా వెలుగులు పంచే అర్థాలున్నాయనీ, ఆయన జీవితమంతా కార్మికులు, పేదల పక్షాన పోరాడిన మహనీయుడని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో కార్మికోద్యమ నేత బీటీ రణదీవె 117వ జయంతి నిర్వహించారు. రణదీవె చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాంబే టెక్స్టైల్ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారనీ, బాంబే టెక్స్టైల్ యూనియన్‌లో ఆయన చేరే నాటికి 5000 సభ్యత్వం ఉంటే.. ఆయన మిలిటెంట్ పోరాటాల ఫలితంగా రెండేండ్లలో అది 60 వేలకు చేరిన క్రమాన్ని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టున్న నేత రణదీవె అని గుర్తుచేశారు. సీఐటీయూపై బ్యాన్ విధిస్తే తెరవెనుక ఉండి యూసీటీయూ పేరుతో నడిపిన కార్మిక ఉద్యమాలను గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం రైల్వే సమ్మెను అణచివేసిన తీరును సీఐటీయూ నాయకత్వం పసిగట్టి రానున్న రోజుల్లో మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం రాబోతున్నదని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించారు. సీఐటీయూ చెప్పినట్టే ఎమర్జెన్సీ వచ్చిందనీ, కార్మిక వర్గం హక్కులను రద్దు చేసిందని తెలిపారు. రణదీవె సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపారనీ, 1964లో ఆయన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో మెంబర్‌గా ఎన్నికయ్యే నాటికి జైలులోనే ఉన్నారని గుర్తుచేశారు. జనతాప్రభుత్వం తెచ్చిన ఇండ్రస్టీయల్ రిలేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని దండయాత్రకు సిద్ధం చేసిన ఘనత సీఐటీయూకి దక్కుతుందనీ, ఐక్య పోరాటాలే ధ్యేయంగా కార్మిక సంఘాలను ఒక్కతాటిపైకి తెచ్చి విజయాన్ని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. జనతా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీఎంఎస్ నేతలు కూడా అనివార్యంగా కార్మిక ఉద్యమాన్ని బలపర్చాల్సిన పరిస్థితిని కల్పించారన్నారు. ఆయన 1970 నుంచి చనిపోయే వరకూ సీఐటీయూ అధ్యక్షులుగా ఉన్నారనీ, సీఐటీయూని ఉన్నత శిఖరాలకు చేర్చిచిన వారిలో బీటీఆర్ ఒకరని ప్రశంసించారు. ఆయన ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోకి వచ్చిన నాటి నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకూ జరిగిన కీలకమైన కార్మిక ఉద్యమాల్లో బీటీఆర్ కీలక పోషించారన్నారు. ఎమ్ఏ ఎకనామిక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్ అయినా..కార్మిక వర్గ విముక్తి కోసం తన జీవితాన్ని ధారబోశారన్నారు. ఆయన పోరాటస్ఫూర్తితో నేటి నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ కోశాధికారి వంగూరు రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ కార్యదర్శి బి.మధు, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.