Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర
- యాసంగి సాగుపై రైతులకు స్పష్టతనివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం సాయిబాబు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ఒకరిపై, మరొకరు ఆరోపణలు చేసుకుంటూ నాటకాలాడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం సాయిబాబు విమర్శించారు. ఆదివారం హన్మకొండలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఇచ్చిన హామీలైన బయ్యారంలో స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ తదితర హామీలను ఏడేండ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అయినా అధికార టీఆర్ఎస్ పార్టీ నీళ్ళు నములుతూ బీజేపీకి అనేక సందర్భాల్లో వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్య పెట్టే పద్ధతిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. సింగరేణి బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. 2015లో ఈ బొగ్గు గనుల వేలం పాట వేసే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే టీఆర్ఎస్ ఎంపీలందరూ బలపరిచినట్టు గుర్తుచేశారు. బొగ్గు రంగాన్ని ధ్వంసం చేసే చర్యలకు బీజేపీ వ్యూహరచన చేస్తే దాంట్లో పావులుగా టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనమని చెబుతున్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కేంద్రం కొనబోమని చెబుతుందనీ, అందుకే తామూ వడ్లు కొనమని సీఎం కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. తెలంగాణలో రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టి పూర్తిచేసిన సాగు నీటి ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చాక వరి సాగు చేయొద్దనడం అన్యాయమని తెలిపారు. ఇక్కడ వరి, గోధుమలు పండించొద్దని చెప్పి బహుళజాతి సంస్థ నుంచి ఉత్పత్తి చేసుకోవడానికి ఈ రెండు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. యాసంగిలో రైతులకు సాగుపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
కరోనాతో విద్యాసంస్థలు మూతపడటంతో గ్రామీణ ప్రాంత విద్యార్ధులు ఆన్లైన్ తరగతులు వినే పరిస్థితి లేక విద్యకు దూరమయ్యారన్నారు. ఇప్పుడు విద్యాసంస్థలు తెరిచినా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో.. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిలయ్యారన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం నోరు మొదపకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చేస్తున్న మోసాలపై ప్రజలంతా ఏకమై సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి, జి. ప్రభాకర్ రెడ్డి, టి. ఉప్పలయ్య, గొడుగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.