Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారంతోనే ఆగొద్దు..
- పాలకుల నైజాన్నీ అర్థం చేసుకోవాలి
- ప్రజల్ని మోసం చేయటంలో ఆ ఇద్దరూ ఒక్కటే..
- ఖాళీ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం: తెలంగాణ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్స్ మెయింటెనెన్స్ ప్రాజెక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ మహాసభలో జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోరాడితేనే హక్కులు సాధించుకుంటామని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఇంజనీరింగ్ డిపార్టు మెంట్స్ మెయింటెనెన్స్, ప్రాజెక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ మూడో మహాసభలు ఆదివారం అసోసియేషన్ అధ్యక్షులు జహింగీర్బాబ, కార్యనిర్వాహక అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నారని చెప్పారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే..పోరాటాలు తప్ప మరో మార్గం లేదన్నారు. బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చినంక కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాలను వేగవంతం చేసిందని చెప్పారు. ఎనిమిది గంటల పనివిధానానికి తూట్లు పొడిచే విధంగా నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. పని భద్రత లేకుండా పోతున్నదని ఆందోళన వ్యవక్తం చేశారు. రాత్రి పూట మహిళలు పనిచేయకూడదన్న హక్కులకు తూట్లు పొడిచిందన్నారు. వ్యవసాయ రంగం దివాళా తీసే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందనీ, రైతులు సుదీర్ఘ ఆందోళన చేపట్టటంతో కేంద్రం అనివార్యంగా వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేలు, ఎల్ఐసీ, విమానాశ్రయాలు, ఓడరేవులు, డిఫెన్స్ రంగం, విశాఖ ఉక్కులాంటి సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచించకుండా..మతం, కులం, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రగిలిస్తున్నదని చెప్పారు. కరోనా కాలంలోనే భారీగా పెట్రో, డీజిల్ , గ్యాస్ ధరలు పెంచిందని వివరించారు. సామాన్యులు కొనలేని స్థితిలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే..దేశంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయటంలో పూర్తిగా విఫలమయిందన్నారు. దళిత బంధు, మూడెకరాల భూమి, ఓట్ల పథకాలుగా మిగిలాయన్నారు. ప్రజల సమస్యలు వినే స్థితిలో ముఖ్యమంత్రి లేరని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలను కల్పించకుండా కాకమ్మ కథలు చెబుతున్నారని విమర్శించారు.
సీఐటీయు రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, జె వెంకటేశ్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఎవరికి వారం కాకుండా అందరం కలిసి ఉద్యమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. జీతాలు, ఇతర అలవెన్సులు పీఏఓల ద్వారానే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్లలో పర్మినెంట్ మెయింటెనెన్స్ పోస్టులు ఆమోదించి, ఉద్యోగాల భర్తీ చేయాలని ఉద్యమించక తప్పదన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ కార్మికోద్యమ నాయకుడు లక్ష్మిదాస్ కుమారుడు పి రాంచందర్ ప్రారంభంలో జెండా ఎగురవేయగా..మూడు యూనియన్ల అధ్యక్షులు మల్లిఖార్జునరావు, వి శ్రీనివాస్, వి వీరభద్రం, ప్రధాన కార్యదర్శి జి వెంకటరెడ్డి, మూడు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.