Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాహ వయసు పెంపుపై సీపీఐ(ఎం)
- వ్యాక్సినేషన్ వేగం పెంచాలి
- రాజ్యాంగ వ్యవస్థల్లో పీఎంఓ జోక్యం సరికాదు..
న్యూఢిల్లీ : మహిళల వివాహ వయస్సు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు మద్ద తునివ్వదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. కరోనాతో కొత్త ప్రమాదాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వ్యాక్సి నేషన్ వేగం పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 17,18 తేదీల్లో న్యూఢిల్లీలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.
మహిళల వివాహ వయసు పెంపు
మహిళల వివాహ వయస్సును ప్రస్తుతం ఉన్న 18 ఏండ్ల నుంచి 21ఏండ్లకు పెంచుతూ బీజేపీ ప్రభత్వం ప్రతిపాదిం చిన బిల్లుకు సీపీఐ(ఎం) మద్దతునివ్వదు. ఈ బిల్లు కోసం ప్రభుత్వం ముందుకు తెచ్చిన కారణాలు సంతృప్తికరంగా లేవు. మరింత లోతైన పరిశీలనకు, సంబంధితులందరితో సంప్రదింపుల కోసం ఈ ముసాయిదా బిల్లును నిర్దేశిత పార్ల మెంటు స్టాండింగ్ కమిటీకి పంపాలి. 18 ఏండ్లు నిండిన మహిళ చట్టబద్ధంగా వయోజనురాలు. వివాహ విషయంలో ఆమెను బాల్య వయస్సు గల వ్యక్తిగా పరిగణించడం చట్ట విరుద్ధమేగాక తనకు నచ్చిన వ్యక్తిని భాగస్వామిగా చేసుకొనే వయోజన హక్కును ఉల్లంఘించడమే. ఈ ప్రతిపాదన మహిళ తన సొంత జీవిత గమనాన్ని నిర్ణయించుకోకుండా చేస్తుంది. ప్రస్తుతం కనీస వయస్సు 18 ఏండ్లుగా ఉన్నప్ప టికీ, అధికారిక సమాచారం ప్రకారం 2017లో అఖిల భారత సగటు వివాహ వయస్సు 22.1 సంవత్సరాలు. కాబట్టి ఈ చట్టం అనవసరం. ప్రభుత్వం వాదిస్తున్నట్లుగా, ఆరోగ్య కారణాల వల్ల ఈ బిల్లును పరిగణనలోకి తీసుకుంటే, మాతా - శిశు మరణాలను నివారించడానికి పోషకాహారం, ఆహార భద్రతను కల్పించడం అవసరం. మహిళల వివాహ వయస్సు పెంచడం పరిష్కారం కాదు.
కోవిడ్ మహమ్మారి: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
నూతన వేరియంట్ ఒమిక్రాన్ మరింత మందికి వ్యాపి స్తుండటంతో కరోనా మహమ్మారి నుంచి కొత్త ప్రమాదాలు పుట్టుకొచ్చాయి. ఈఏడాది ముగింపు నాటికి దేశంలోని పెద్ద లందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా ప్రకటించినప్పటికీ, డిసెంబర్ 18 నాటికి మన జనాభాలో కేవలం 39 శాతం మందికి మాత్రమే టీకా రెండు డోస్లువేశారు. దేశంలో మరొక ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడకుండా నిరోధించ డానికి వ్యాక్సినేషన్‌ను తక్షణమే వేగవంతం చేయాలి.
లఖింపూర్ ఖేరీ హత్యలు
ముందస్తు ప్రణాళిక కుట్ర కారణంగానే లఖింపూర్ ఖేరిలో రైతులు మరణించారని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బందృం పేర్కొంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దారుణ హత్యకు గురయ్యారు. ప్రధాన నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు. ప్రజల నిరసనలు వెల్లువెత్తినా ప్రధాని మోడీ మంత్రివర్గం నుంచి ఆ మంత్రిని తొలగించలేదు. తక్షణమే ఆయనను తొలగించాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
బ్యాంకు సమ్మె విజయవంతం
డిసెంబర్ 16,17 తేదీల్లో సమ్మెను విజయవంతం చేసినందుకు సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులను సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో అభినందించింది. ఈ సమ్మెకు వివిధ కార్మిక సంఘాల నుంచి విస్తృత మద్దతు, ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది. బ్యాంకు ఖాతాలలో భారతీయ ప్రజల జీవితకాల పొదుపులను దోచుకోవడానికి ఈ ప్రభుత్వ అండదండలు అప్పగించే విధానాన్ని బ్యాంకు యూనియన్లు బట్టబయలు చేశాయి. ఇన్నేండ్ల మోడీ ప్రభుత్వ హయాంలో రూ.10.7 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. ప్రజల సొమ్ముతో మళ్లీ బ్యాంకులను రీ-కాపిటైలేజ్డ్ చేశారు. ఇది దుర్మార్గం. ప్రభుత్వ రంగ బ్యాంకులను మోడీ ప్రభుత్వం ఈ విధంగా ప్రమాదంలోకి నెడుతూ, దీనిని ప్రయివేటీకరణకు సాకుగా ఉపయోగించుకుంటుంది. ఇది దేశానికి, ప్రజలకు వినాశకరం. ఇటువంటి ప్రయివేటీకరణ ప్రణాళికలను తక్షణమే ఉపసంహరించుకోవాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
ధర పెరుగుదల
టోకు ధరల సూచీ నవంబర్‌లో 14.2 శాతం పెరిగింది. ఇది గత ముప్పై ఏండ్లలో అత్యధికం. టోకు ఇంధనం, విద్యుత్ ధరలు 39.81 శాతం పెరిగాయి. ఆహారం, ఇంధన ధరలు పన్నెండ్లే రికార్డుకు చేరుకున్నాయి. ఇది ప్రజల కష్టాలను మరింతగా పెంచుతోంది. నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అన్ని శాఖలకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో పిలుపునిచ్చింది.
నిరుద్యోగం
ఒక్క నవంబర్ నెలలోనే 68 లక్షల మంది వేతన కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. పట్టణ నిరుద్యోగం 17 వారాల గరిష్టానికి, మొత్తం నిరుద్యోగం 9 వారాల గరిష్టానికి చేరుకున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు ఈ నిరుద్యోగిత ప్రజలపై మరిన్ని భారాలను మోపుతున్నాయి. ప్రభుత్వ తిరోగమన చర్యలు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మరింత తగ్గి, మాంద్యం పెరగడానికి దోహదం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించని ప్రతి కుటుంబానికి ( నాన్-ఇన్‌కం ట్యాక్స్ ఫ్యామిలీ) నెలకు ప్రత్యక్ష నగదు బదిలీ కనీసం రూ. 7,500 తక్షణమే ఇవ్వాలి.
ఎన్నికల కమిషన్‌ను పీఎంఓకు పిలిపించడం ఖండనీయం
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్వతంత్ర రాజ్యాంగ సంస్థ. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఏకైక సంస్థ. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి అది ప్రభుత్వం నుంచి పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను పీఎంఓ సమన్ చేయడం రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించడమే. మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి చర్యల వల్ల ఎన్నికల సంఘం నిష్పాక్షిత, తటస్థ వైఖరిపై ప్రజలకున్న విశ్వాసం సన్నగిల్లుతుంది. పొలిట్ బ్యూరో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మన రాజ్యాంగ వ్యవస్థల స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడం ఆపాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ముసాయిదా రాజకీయ తీర్మానం ఖరారు
పార్టీ 23వ అఖిలభారత మహాసభ ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని పొలిట్ బ్యూరో చర్చించి ఖరారు చేసింది. దీనిని షెడ్యూల్ ప్రకారం 2022 జనవరి 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న కేంద్ర కమిటీ ముందుంచుతుంది.