Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్మినెంట్ కోసం కాంట్రాక్టు లెక్చరర్లు కొట్లాడాలి
- విద్యావ్యవస్థలో కాంట్రాక్టీకరణ పెద్ద దుర్మార్గం
- మిగతా శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల్నీ కలుపుకుని పోవాలి : రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలకులు సంఘటిత పోరాటాలకే తలొగ్గుతారనీ, తమను పర్మినెంట్ చేసేదాకా కాంట్రాక్టు లెక్చరర్లు ఐక్యంగా కొట్లాడాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. మిగతా శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల్నీ కలుపుకుని జీవో 16 కోసం ఐక్య పోరాటం చేయాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 'తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్ధీకరణ-భవిష్యత్ కార్యాచరణ' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అందె సత్యం సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. విద్యారంగంలోకి కాంట్రాక్టు వ్యవస్థను తీసుకురావడమే పెద్ద దుర్మార్గమని విమర్శించారు. కార్పొరేట్ వ్యవస్థ పాలకవర్గాన్ని శాసిస్తున్నదని చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానం చాలా దారుణంగా ఉందనీ, దాంతో ఉద్యోగుల భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఇప్పటికే 96 శాతం మంది భద్రతలేని ఉద్యోగాలతో బతుకులను నెట్టుకొస్తున్నారన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థ ఏమిటని ప్రశ్నించారు. అవసరమైతే దీనిపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్తామన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి వాటిని పూర్తిగా క్రమబద్ధీకరించాలని ప్రస్తుత సీఎం కేసీఆర్ కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అది ఉద్యమ నినాదంగా మారిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రమొచ్చిన తర్వాత ప్రభుత్వం కొంత ఉత్సాహం చూపినప్పటికీ తర్వాత అది అటకెక్కిందన్నారు. నేటికీ రద్దు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ఆర్టిజన్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ధర్నాచౌక్‌ను కాపాడుకోవడం కోసం..ఇలా మూడు ముఖ్య ఉద్యమాలు జరిగాయని చెప్పారు. ఐక్యంగా పోరాడటం వల్ల 24 వేలమంది ఆర్టిజన్ ఉద్యోగులను రాష్ట్ర సర్కారు రెగ్యులరైజ్ చేసిందన్నారు. ఏండ్లతరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్, చర్చను ప్రజల్లోకి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని హామీనిచ్చారు.
అందె సత్యం మాట్లాడుతూ..తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతంలో కాంట్రాక్టు లెక్చరర్ల పాత్ర కీలకమన్నారు. జూని యర్ కళాశాలల్లో ప్రభుత్వ లెక్చరర్లు 20 శాతం మాత్రమే ఉన్నారనీ, మిగతా వారంతా కాంట్రాక్టు లెక్చరర్లేనని చెప్పారు. అలాంటి వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హెల్త్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ..కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జీవో 16 అమలు కోసం ఐక్యం పోరాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుశెట్టి సురేశ్ మాట్లాడుతూ..వెట్టిచాకిరి, శ్రమదోపిడీ అయిన కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 16 అమలు కోసం ఇతర శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లతో జేఏసీ ఏర్పాటు చేసి ముందుకు సాగుతామని ప్రకటించారు. కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేట్ అధ్యక్షులు శోభన్‌బాబు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి కన్వీనర్ రామకృష్ణగౌడ్, సమన్వయకర్త యం.జంగయ్య, హైకోర్టు న్యాయవాది మూర్తి, టీజీఓ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశం, పాలిటెక్నిక్ లెక్చరర్ల అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షులు నవీన్‌కుమార్, యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం నాయకులు డాక్టర్ ఆనంద్, ఐప్యాక్టో నాయకులు రత్నప్రభాకర్, గంగాధర్, రహీమ్, గోవర్ధన్, రశీద్, విశాలాక్షి, తదితరులు పాల్గొన్నారు.