Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్ని మభ్యపెట్టేందుకేనా?
- ఢిల్లీ పర్యటనపై నో క్లారిటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తేల్చుకునేందుకు అమాత్యులు ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. కేంద్రంతో 'అమీతుమీ' తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అంతవరకు బాగానే ఉన్నది. కానీ ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలిసి రైతుల గోడు వినిపించాలనే ప్రయత్నంలో శనివారం ఢిల్లీ వెళ్లిన బృందం సాధించడానికి అష్టకష్టాలు పడుతున్న రైతులను పట్టించుకోకుండా, కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పేందుకే ప్రయత్నిస్తున్నట్టు కనపడుతున్నది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్రమే కారణమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవడం లేదు. సీఎం కేసీఆర్ వరి ధాన్యం విషయంలో ఇప్పటికీ సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. పైగా కేంద్రంతో కొట్లాడుతున్నట్టు రైతులను నమ్మించేందుకు ఢిల్లీ వెళ్లారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ బృందానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగానే కేంద్ర మంత్రుల అపాయింట్మెంటు తీసుకుని ఉండేవారు. అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీలో ధర్నా చేయాల్సిన సమయంలో తామొక్కళ్లమే చేస్తేనే సాధ్యమని చెప్పుకోడానికేనా అని రైతాంగం ప్రశ్నిస్తున్నది. కేంద్రం అనుమతి ఇవ్వకపోయినా హస్తినలో తేల్చుకుంటామనే భరోసా ఇవ్వడంలేదు. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో (శనివారం, ఆదివారం) ఆ బృందం హస్తినకు వెళ్లింది. ఈ రెండు రోజుల్లో కేంద్ర మంత్రులు, అధికారులుగానీ అందుబాటులో ఉండరనే విషయాన్ని కూడా అమాత్యులకు తెలియదా?దీనిపై పలువిమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రత్యక్షంగా పోరాడుతున్నదనే నమ్మకాన్ని కలిగించేందుకు మంత్రులు, ఎంపీల బృందం హడావుడిగా హస్తినకు తరలి వెళ్లారని చెబుతున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత అపాయింటుమెంటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజరుకుమార్, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు పార్లమెంట్ సభ్యులు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి పీయూష్గోయల్ను కలిసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి, అదనపు ధాన్యం కొనుగోలుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆమోదం తెలపలేదు. ఈ ఏడాది యాసంగి వరి ధాన్యం విషయంలో రా, బాయిల్డ్ రైస్ అంటూ పార్లమెంటు సాక్షిగా తప్పుడు ప్రకటనలతో కేంద్రం ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నది. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడుతున్నామంటూనే, మరోవైపు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకుండానే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను బారుకాట్ చేసి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. దీంతో ఎంపీలు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. కేంద్రాన్ని ఇరుకున పెట్టాల్సిన ఎంపీలు...రాష్ట్రంలోనూ ఎటువంటి ఆందోళనలు నిర్వహించలేదు. మరోవైపు వానాకాలం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించకపోవడంతో రెండు వందలపైగా మంది రైతులు వరికుప్పలపై ప్రాణాలొదిలారు. ఆ రైతుల విషయంలో నోరుమెపదని టీఆర్ఎస్ మంత్రులు...కేంద్రంతో ఏం కొట్లాడుతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.