Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం..
- పోరుగల్లుకు వందనం : జస్టిస్ ఎన్వీ రమణ
- కోర్టుభవన సముదాయం ప్రారంభం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కోర్టులో మౌలిక సదుపాయల కల్పన కోసం 'జుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్'ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయగా.. నేటికీ స్పందన లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా వరంగల్‌కు వచ్చిన ఆయన ఆదివారం హన్మకొండలో రూ.23.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని సీజేఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంల2ో శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కలిసి కోర్డు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీజేఐ మాట్లాడారు. 'తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకు రా.. అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదనుచు సకలించు ఆంధ్రుడా చావవెందుకురా..' అన్న కాళోజీని స్ఫూర్తిగా తీసుకొని తెలుగులో మాట్లాడటానికి సాహసిస్తున్నానంటూ రమణ ప్రసంగాన్ని మొదలెట్టారు. 'ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని దాశరథి గర్జించారని గుర్తు చేశారు. దాశరథి గర్జన పరపీడన విముక్తి పోరాటానికి ఊపిరినిచ్చిందని చెప్పారు. ఇలా.. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక వారసత్వానికి నిలయమైన వరంగల్‌తో తనకు ఆత్మీయ అనుబంధముందని గుర్తు చేశారు. అంతర్జాతీయ కమ్యూనిజం నుంచి జాతీయ కాంగ్రెస్ ఉద్యమం వరకు.. ప్రగతిశీల ఉద్యమాలకు వరంగల్ నెలవని తెలిపారు. దేశానికి ప్రధానిని ఇచ్చిన నేలగా కీర్తించారు. ఇక్కడ తనకు బంధువులు, మిత్రులున్నారనీ, నగరంలో మూడు సాహిత్య పాఠశాలకు హాజరయ్యాననీ, వరంగల్ ఆర్ఈసీలో విద్యార్థి సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు.
ఒకనాడు రాజకీయాల్లో న్యాయవాదులు అధికంగా ఉండేవారనీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. న్యాయవాదులు కేవలం కుటుంబాలకై పరిమితం కావడం భావ్యం కాదనీ, సామాజిక బాధ్యతనూ గుర్తెరగాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి వల్ల కోర్టులు మూతపడి గ్రామీణ ప్రాంతాల్లోని న్యాయవాదులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారిని ఆదుకోవడం కోసం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోర్టులు నడిచేలా 'మొబైల్ నెట్వర్కింగ్' వ్యాన్‌తో చర్యలు తీసుకోవాలని కోరినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. వరంగల్ కోర్టులో 23 కోర్టులున్నాయనీ, ఇందులో 71,348 కేసులు పెం డింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 1984 నుంచి కూడా ఒక కేసు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటం న్యాయమూర్తుల కొరతతో మాత్రమే కాదనీ, కోర్టుల్లో మౌలిక వసతులు లేకపోవడమూ కారణమన్నారు. శిధిలావస్థలో ఉన్న కోర్టు భవనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పునరుద్ధరించాల్సి ఉండగా తెలంగాణలో భిన్నమైన పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి పూర్తి చేయడం అభినందనీయమన్నారు. జుడీషియరీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను అభినందించారు. వరంగల్ కోర్టు భవన నిర్మాణానికి కృషి చేసిన జస్టిస్ నవీన్‌రావును అభినందించారు. జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యం బాగా లేకపోయినా వేల సంఖ్యలో కేసులు పరిష్కరించారని గుర్తు చేశారు. ఆయన ఉద్యోగ విరమణ చేసినా ఆయన సేవలను ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ వినియోగించుకుంటున్నట్టు తెలిపారు.
రామప్ప అద్భుతం..
రామప్ప అద్భుత కళాక్షేత్రమనీ, చూడడానికి రెండు కళ్లు చాలలేదని చెప్పారు. యునెస్కో గుర్తింపు గర్వకారణమన్నారు. వేయి స్తంభాల ఆలయం అద్భుతంగా ఉందన్నారు. ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దంపతులు భద్రకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు. వరంగల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భురునా తదితరులు పాల్గోన్నారు.