Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సుమోటో'పై టీఎస్ఈఆర్సీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డిస్కంలు ఇవ్వాల్సిన టారిఫ్ ప్రతిపాదనలను వారంరోజుల్లో సమర్పించాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఆదేశించింది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలను (ఏఆర్ఆర్) ఈ ఏడాది నవంబర్ 30న ఈఆర్సీకి ఇచ్చిన డిస్కంలు చార్జీల సవరణ (పెంపు)కు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలు ఇవ్వలేదు. త్వరలో వాటిని ఇవ్వాలని అప్పట్లో ఈఆర్సీ డిస్కంలను కోరింది. దాదాపు 20 రోజులు గడిచిపోయినా డిస్కంలు స్పందించకపోవడంతో దీనిని ఈఆర్సీ సుమోటోగా స్వీకరించి, సోమవారం విచారణకు డిస్కంల సీఎమ్డీలను పిలిచింది. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీలు జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు విచారణకు హజరై, టారిఫ్ ప్రతిపాదనల సమర్పణకు మరో పదిరోజులు గడువు కావాలని కోరారు. దీనిపై టీఎస్ఈఆర్సీ చైర్మెన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు (టెక్నికల్, ఆర్థికం) ఎమ్డీ మనోహరరాజు, బండారు కృష్ణయ్య విచారణ జరిపారు. ఈనెల 30 వరకు డిస్కంలు గడువు కోరగా, ఈనెల 27వ తేదీ లోపు టారిఫ్ ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు వరుసగా మూడు రోజలు సమీక్షా సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
టారిఫ్ ప్రతిపాదనలపై చర్చించి, ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత వాటిని ఆఈర్సీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అదే సందర్భంలో టారిఫ్ ప్రతిపాదనలు ఇవ్వకుండా, చార్జీల పెంపు అంశాన్ని ఈఆర్సీకే వదిలేస్తే, ఎలా ఉంటుందనే అంశపై కూడా చర్చలు జరిగాయి. చార్జీల పెంచాలని ఈఆర్సీ ఆదేశిస్తే, దానిలో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదనీ, మండలి నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని సమర్థించుకోవచ్చనే రాజకీయ కోణంలోనూ ఈ చర్చలు జరిగినట్టు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈఆర్సీ ఇచ్చిన గడువులోపు టారిఫ్ ప్రతిపాదనలు ఇస్తారా లేక చార్జీల పెంచారనే అపవాదు ప్రభుత్వంపై లేకుండా మధ్యేమార్గం అనుసరిస్తారో వేచిచూడాలి!