Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరాకు రూ.లక్ష పరిహారమివ్వాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తామర వైరస్ సోకటంతో చేతికి వచ్చిన మిరప పంట తీవ్రంగా దెబ్బతిన్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసింది. నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, గద్వాల జిల్లాల్లో మిరప ప్రధాన వాణిజ్య పంటగా రైతులు వేస్తారని తెలిపారు. ఈ ఏడాది ధర ఒక మోస్తరుగా బాగానే ఉంటుందని భావించి, పంట గిట్టుబాటు అవుతుందనే ఆశతో మిర్చిని వారు సాగుచేశారని గుర్తు చేశారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా ''తామర వైరస్'' సోకడంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పంటంతా దెబ్బతిన్నదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం చెల్లించడం లేదని విమర్శించారు. సుగంధ ద్రవ్యాల బోర్డు స్పందించి ఈ నష్టానికి కారణాలను గుర్తించాలనీ, బోర్డు ద్వారానైనా రైతులకు తక్షణమే అవసరమైన సలహాలు అందించాలని కోరారు. కేరళలో ఉన్న బోర్డుకు వరంగల్లో సబ్బోర్డుగా ఉందని వివరించారు. వెంటనే ఆ బోర్డు అధికారులు నష్టం జరిగిన పంటల ప్రాంతాలను పర్యటించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.