Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటరు ఐడీకి ఆధార్ లింకొద్దు : మాజీ సివిల్ సర్వెంట్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్త వ్యతిరేకత
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆమోదం పొందిన ఓటరు కార్డుతో ఆధార్ లింకు బిల్లు ప్రమాదకరమైన ఆలోచన అని మాజీ సివిల్ సర్వెంట్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఇది చట్టంగా మారితే బడుగు, బలహీన, పేద వర్గాలకు చెందిన లక్షల మంది ఓటు హక్కు గల్లంతవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా మాజీ సివిల్ సర్వెంట్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు, విద్యార్థులు సహా 500 మందికి పైగా ప్రముఖ వ్యక్తులు.. ఓటరు ఐడీకి ఆధార్ లింక్ వొద్దంటూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఓటరు డేటాబేస్‌ను ఆధార్‌తో లింక్ చేయాలనే భారత ఎన్నికల సంఘం ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని ''మన ప్రజాస్వామ్య నిర్మాణాన్ని మార్చే ప్రమాదకరమైన ఆలోచన''గా పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో ఎలక్టోరల్ రిఫార్మ్ గ్రూప్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, ఎంకేఎస్ఎస్, ఆదివాసీ ఉమెన్స్ నెట్వర్క్, చేతన ఆందోళన్, ఎన్ఏపీఎం జార్ఖండ్ వంటి పౌర సంఘాలు ఉన్నాయి. అలాగే, డిజిటల్ రైట్ గ్రూపులు రీథింక్ ఆధార్, ఆర్టికల్ 21 ట్రస్ట్, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్, బచావో ప్రాజెక్ట్, ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ హక్కుల సమూహాలు కూడా ఉన్నాయి.
తమ ప్రకటనలో ''ఓటరు ఐడీకి ఆధార్‌ను లింక్ చేయడమనేది మన ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే.. అనాలోచిత, అశాస్త్రీయమైన, అనవసరమైన చర్య అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, ఆధార్‌లోని భారీ వ్యత్యాస డేటా కారణంగా అధిక సంఖ్యలో ఓటర్లు తొలగింపునకు గురవుతారని తెలిపారు. ప్రజల గోప్యత హక్కును ఉల్లంఘించబడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 'ఓటు హక్కుకు ఆధార్ రుజువు కాదు. అలాగే, పౌరసత్వానికి రుజువుగా ఆధార్ ఎప్పుడూ ఉపయోగపడదు. అందుకే పౌరులకు కాకుండా నివాసితులందరికీ ఆధార్ నంబర్లు జారీ చేయబడ్డాయి. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, భారతదేశంలో నివసించే పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఈ రెండింటిని లింక్ చేయడం అర్ధంలేనిది. ఎటువంటి ఆధారం లేకుండా ఉంటుంది. ఆధార్‌కు అనుగుణంగా ఓటును తొలగించడానికి చట్టపరమైన ఆధారం లేదు. రెండోది సమూహిక హక్కులకు హరిస్తుంది. ఆధార్, ఓటర్ ఐడీ అనుసంధానం వద్దని కోర్టు తీర్పులకు వ్యతిరేకం. గతంలో ఆధార్ డేటా దుర్వినియోగం అయిన విషయాలు ప్రస్తావించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ డేటాను అనుసంధానించారు. 2018లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, కనీసం 55 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోయారని బయటపడటం.. ప్రజాగ్రహం తర్వాత ప్రభుత్వం వెనక్కితగ్గింది. అలాగే, ఎంజీఎన్ఆర్ఈజీఏ, పీడీఎస్ వంటి ప్రభుత్వ రిజిస్ట్రీల డేటాబేస్లను క్లీన్అప్ చేయడానికి ఆధార్‌ను ఉపయోగించడంలో అనేక తప్పులు దొర్లాయి. అనేక మంది ఎలాంటి నోటీసులు లేకుండానే తొలగించబడ్డారు. ఓటరు మోసాలను సైతం పెంచే అవకాశాలున్నాయని ఈ ప్రకటన పేర్కొన్నారు. ఓటరు, ఆధార్ అనుసంధానం గోప్యత హక్కును హరించడమే కాకుండా దుర్వినియోగం కావడానికి అధిక ఆస్కారం ఉందనీ, ఓటు గోప్యత, ప్రాథమిక హక్కులను సైతం ఉల్లంఘిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.