Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు చర్చలకు పిలిచే అవకాశం...?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చలు జరిపేందుకోసం శనివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు ఇప్పటి వరకూ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరకలేదు. అయితే మంగళవారం వారిని చర్చలకు పిలిచే అవకాశముందని సమాచారం. అపాయింట్మెంట్ దొరికేంతవరకూ అక్కడే ఉండాలంటూ సీఎం కేసీఆర్ వారిని ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు సోమవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్లో పండిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై లిఖితపూర్వక హామీనివ్వాలని కోరారు. తాము రాజకీయాలు చేయటానికి ఢిల్లీకి రాలేదని అన్నారు. రైతుల సమస్యలను విన్నవించేందుకు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం సరికాదని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవహారశైలి తెలంగాణ రైతులను అవమానించేదిగా ఉందని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేతగాని తదితరులు పాల్గొన్నారు.