Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
చేనేత వస్త్ర పరిశ్రమపై వస్తు సేవల పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య భవన్లో ఆయన మాట్లాడారు. చేనేత వస్త్రాలపై గతంలో 5 శాతం ఉన్న జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచిందన్నారు. దీంతో చేనేత పరిశ్రమ మరింత ప్రమాదంలో పడిందన్నారు. దేశ చరిత్రలో చేనేత ఉత్పత్తులకు ఏనాడూ పన్ను విధించలేదన్నారు. ఇప్పటికే పనులు లేక.. నేసిన వస్త్రాలు అమ్ముడుపోక అర్ధాకలితో జీవిస్తున్న చేనేత కుటుంబాలను మరింత ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి ఇదన్నారు. ఆకలిచావులు, ఆత్మహత్యలు పెరిగాయని, ఏడేండ్లలో రాష్ట్రంలో 750 మంది చనిపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలన్నారు. పేరుకుపోయిన చేనేత నిల్వల కొనుగోలుకు ప్రభుత్వం దాదాపు రూ.400కోట్ల వరకు నిధులను మం జూరు చేసి, కార్మికులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హ్యాండ్లూమ్ బోర్డును ఎత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, జిల్లా సహాయ కార్యదర్శి రావిరాల మారయ్య, నాయకులు రుద్రమార్ కొండయ్య, గణేష్, లక్ష్మయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.