Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్ యధావిధిగా కొనసాగించాలి
- అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన అంగన్వాడీలు
నవతెలంగాణ - విలేకరులు
ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, పెంచిన వేతనాలు, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టారు.
యాద్రాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలకు పెంచిన పీఆర్సీ వేతనాలు ఏప్రిల్ నెల నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన వేతనాలనూ 2018 అక్టోబర్ నుంచి చెల్లించాలన్నారు. మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్ విడుదల చేసి పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్స్, రిజిస్టర్, స్టేషనరీ డబ్బులు చెల్లించాలని, ఇన్చార్జిల అలవెన్సులు చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు.. కలెక్టరేట్ ఎదుట బైటాయించి మహాధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి త్రివేణి మాట్లాడారు. మంచిర్యాలలో అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఏవో సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీఐటీయూ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా వచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనకారులు కార్యాలయంలోకి రాకుండా పోలీసులు బారీకెడ్లు ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం మండల రెవెన్యూ అధికారి నారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు.