Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల హక్కుల కోసం నిలబడేది ఎర్రజెండాయే..
- సీపీఐ(ఎం) నిర్మల్ జిల్లా రెండో మహాసభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాయిబాబు
నవతెలంగాణ-నిర్మల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలు వేగంగా అమలు చేస్తూ అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సాయిబాబు అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో సీపీఐ(ఎం) జిల్లా రెండో మహాసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సాయిబాబు ప్రారంభోపన్యాసం చేస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. కోట్లాది మందికి జీవనాధారమైన పరిశ్రమ, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధానాలు అమలు చేస్తోందన్నారు. దీంతో ప్రజల ఆదాయం తగ్గడం, ఉపాధి కోల్పోవడం, నిరుద్యోగం పెరగడం లాంటివి సంభవిస్తునాయన్నారు. దేశ సంపద కొంతమంది దగ్గరే పోగవుతూ సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజల అసంతృప్తిని మోడీ ప్రభుత్వం పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే మతోన్మాద శక్తులను ఉసిగొల్పుతోందని తెలిపారు. జాతీయవాదం పేరుతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందన్నారు. ఈ నిరంకుశ పోకడలను ప్రజా ఉద్యమకారులు, మేధావులు, జర్నలిస్టులు వ్యతిరేకిస్తే వారిపై రాజద్రోహం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రైతులు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఉద్యమిస్తామన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడున్నరేండ్లుగా నిరంకుశ పాలన కొనసాగిస్తోందన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం దొరక్క ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళ న వ్యక్తం చేశారు. ఏండ్లు గడిచినా కోటీ ఇరవై లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేత నాలు పెంచే జీవోలను అమలు చేయడం లేదన్నారు. ఉత్తర తెలంగాణలో 8లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని, వారికి సంబంధించి నేటికీ ఉమ్మడి రాష్ట్రంలోని 2011 జీవోనే అమలవుతోందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదంతో బీడీ కార్మికులు రూ.20వేల కోట్లు నష్టపోయారని తెలిపారు.
నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు ఖర్చు చేసి సాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. యాసంగిలో రైతులను వరి వేయొద్దని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలనకు పోరాటాలతో బుద్ధి చెబుతామన్నారు. మహాసభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, తొడసం భీంరావు, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రి, నిర్మల్ జిల్లా కార్యదర్శి గౌతమ్‌కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.