Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి 25 లక్షల 40 వేల టన్నులు సరఫరా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద నిర్మించిన ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంటులో యూనిట్-1 కోసం సింగరేణి నుంచి బొగ్గును తీసుకొనేందుకు ఒప్పందం ఖరారైంది. ఏడాదికి 25 లక్షల 40 వేల టన్నుల బొగ్గును 25 ఏండ్ల్లపాటు సరఫరా చేసేలా ఒప్పందం జరిగింది. సోమవారంనాడిక్కడి సింగరేణి భవన్లో ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ జవహరి, చీఫ్జనరల్ మేనేజర్ ఎన్ఎన్ రావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పీకే రావత్‌లు సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జే ఆల్విన్, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) కే రవిశంకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) మారెపల్లి వెంకటేశ్వర్లు ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. వాస్తవానికి ఈ యూనిట్‌కు కోలిండియా నుండి బొగ్గును తీసుకోవాల్సి ఉండగా, బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రత్యేక అనుమతితో సింగరేణికి మారారు. ఈసందర్భంగా సింగరేణి అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే 8 రాష్ట్రాల్లోని ఎన్టీపీసీలకు 135.30 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నట్టు వివరించారు.
మీ సహకారం గొప్పది
కర్ణాటకలోని మూడు థర్మల్ విద్యుత్కేంద్రాలకు అవసరమైన పది లక్షల టన్నుల బొగ్గును ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తున్నందుకు ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ పొన్నురాజు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
సోమవారంనాడాయన సింగరేణి భవన్లో డైరెక్టర్ ఎన్ బలరామ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నాటకలోని రాయచూర్, యరమారస్, బళ్లారిలోని మూడు థర్మల్ ప్లాంట్లకు సింగరేణి నుంచే బొగ్గు సరఫరా జరుగుతున్నట్టు తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో ఎలాంటి కొరత లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రోజువారి బొగ్గుసరఫరాను మరింత పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్, చీఫ్ లైజనింగ్ ఆఫీసర్ బీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.