Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాల్లో సమస్యలుంటే మా దృష్టికి తేవాలి: జాక్టో, యూఎస్పీసీ నేతలకు విద్యాశాఖ కార్యదర్శి సూచన
- డీఎస్ఈ ముట్టడి తాత్కాలిక వాయిదా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీనియార్టీ జాబితాల్లో తప్పులను సవరించిన తర్వాతే ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయిస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన అన్నారు. ఏ జిల్లాలో అయినా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నేతలు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఉపాధ్యాయుల కేటాయింపులపై ఆందోళన అవసరంలేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సీనియార్టీ సమస్యలపై సీఎస్ సూచన మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సంచాలకులు శ్రీదేవసేనతో జాక్టో, యూఎస్పీసీ నేతలు జి సదానందంగౌడ్, చావ రవి, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, కొంగల వెంకట్, బి కొండయ్య, వై అశోక్ కుమార్, ఎస్ మహేష్‌లు చర్చలు జరిపారు. సీనియార్టీ జాబితాల్లో తప్పులు సవరించిన తర్వాతే జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ జిల్లాలో సమస్య ఉన్నా తమ దష్టికి తేవాలని వారు సూచించారు. వరంగల్ జిల్లాలో జరిగిన అవకతవకలను కార్యదర్శి దష్టికి తెచ్చారు. వెంటనే ఆయన అక్కడి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. జిల్లా ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడాలంటూ ఆదేశించారు. భార్యాభర్తలు, మ్యూచువల్ బదిలీలు ప్రభుత్వ ఉత్తర్వులకనుగుణంగా రెండోదశలో చేపడతామన్నారని తెలిపారు. జిల్లాల కేటాయింపుల తర్వాత పాఠశాలలకు సర్దుబాటు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని అధికారులు వివరించారని పేర్కొన్నారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి సీనియార్టీ సమస్యలు, జోనల్ కేటాయింపులపై చర్చలు జరుపుతారని తెలిపారు. విద్యాశాఖ అధికారుల హామీమేరకు మంగళవారం తలపెట్టిన డీఎస్ఈ ముట్టడి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు జాక్టో, యూఎస్పీసీ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రెండు రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.
సీనియార్టీ ప్రకారం కేటాయింపు : టీపీయూఎస్
ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 317 ప్రకారం సీనియార్టీకి అనుగుణంగా జిల్లాలకు కేటాయింపులుం టాయని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. ఆ జీవోలోని నిబంధనలను పాటించకుండా సీనియార్టీ జాబితా తయారు చేస్తే పాత జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలని తెలిపారు. కేటాయింపుల తర్వాత వచ్చే సమస్యలు, పాఠశాలలకు సర్దుబాటు మార్గదర్శకాలు తర్వాత విడుదల చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.