Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ-అడిక్ మెట్
ఒక దేశ రథచక్రం నడవాలంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలనీ, ఏ దేశ ఆర్థికవ్యవస్థ బాగాలేకపోతే ఆ దేశం చిన్నాభిన్నమవుతుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ఫెయిర్లోని చిందు ఎల్లమ్మ వేదికపై సోమవారం ఎస్.ఎ. విద్యాసాగర్ రచించిన 'భారత ఆర్థిక వ్యవస్థ' 3వ సంపుటిని సీనియర్ జర్నలిస్ట్ కొండూరి వీరయ్య అధ్యక్షతన జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి. పాపారావు పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, వందన సమర్పణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నివేదికల ద్వారా రచించబడిన ఈ పుస్తకం ఎంతో ప్రామాణికత సంతరించుకుందన్నారు. విక్టోరియా మహారాణి నుంచి మోడీ దాకా ఆర్థిక రంగం ఎలా ఉందో, వ్యవస్థను ఎలా పాలించారో ఈ పుస్తకం చెబుతుందని తెలిపారు. విద్యాసాగర్ రచించిన దేశ ఆర్థిక వ్యవస్థ మూడు సంపుటలు ఎంతో ప్రాచుర్యం పొందాయనీ, నాల్గవ సంపుటి కూడా వస్తుందని చెప్పారు. ఈ పుస్తకంలో ఆర్థిక వ్యవస్థ పరిణామం ఏవిధంగా జరిగిందో పూర్తి విశ్లేషణతో అందించారని తెలిపారు. పెట్టుబడి వాణిజ్యం, పారిశ్రామికీకరణ, జాతీయ ఆర్థిక విధానాలపైన విశ్లేషణ, ప్రభుత్వ రంగ సంస్థల జాతీయకరణ, విదేశీ వాణిజ్యం లాంటి ముఖ్యమైన అధ్యాయాలతో పుస్తకం ప్రచురించబడిందన్నారు. పుస్తక ప్రియులు, భారత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలనే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని కోరారు.