Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు నిర్వహించాలని పది కార్మిక సంఘాలతో కూడిన టీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఎన్నికలు జరిపే ఆలోచనే లేదనీ, అది సాధ్యం కాదంటూ ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ వ్యాఖ్యానించడాన్ని జేఏసీ తప్పుపట్టింది. గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీలో ఎన్నికలు రెండేండ్లు వాయిదా వేస్తున్నట్టు చెప్పారనీ, ఆ గడువు కూడా ముగిసిందని జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి (ఈయూ), వైస్ చైర్మెన్ కె హన్మంతు (టీజేఎమ్‌యూ), కన్వీనర్లు వీఎస్‌రావు (ఎస్‌డబ్ల్యూఎఫ్), పి కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ) గుర్తుచేశారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తూ, ఆర్టీసీలో వద్దు అనడానికి ప్రత్యేక కారణాలు ఏంటని వారు ప్రశ్నించారు. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి ఆర్టీసీలో గుర్తింపు కార్మికసంఘ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నదో చెప్పాలని కోరారు. రెండేండ్లు ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించకుండా, నష్టాన్ని ఎన్ని కోట్లు తగ్గించారని ప్రశ్నించారు. యూనియన్ల వల్లే సమస్యలు వస్తాయనుకుంటే, మరి ఈ రెండేండ్లలో ఎవరి వల్ల సమస్యలు వచ్చాయని అడిగారు. యూనియన్లు లేకపోవడం వల్ల ఆర్టీసీలో కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయనీ, యాజమాన్యం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కార్మికుల్లో అశాంతి పెరిగి మరో సమ్మెకు పరిస్థితులు దారితీస్తాయని హెచ్చరించారు. దానికి ఆర్టీసీ చైర్మెన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. భేషజాలకు పోకుండా ప్రభుత్వం, యాజమాన్యం తక్షణం గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.