Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యలపై స్పందించని మంత్రి సబితను తొలగించాలి
- వామపక్ష విద్యార్థి సంఘాల నేతల డిమాండ్
- కాచిగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు రావడంతో పలువురు విద్యార్థులు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడినా ఆయా ఘటనలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఆమెను తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాచిగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. 'విరు వాంట్ జస్టిస్, ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి'అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎన్ శంకర్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి బోయిన్పల్లి రాము, ఏఐడీఎస్వో రాష్ట్ర కార్యదర్శి గంగాధర్ పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరుశురాం మాట్లాడుతూ ఫెయిలైన విద్యార్థులకు పాస్ మార్కులివ్వాలని డిమాండ్ చేశారు. ఉచితంగా ఇంప్రూమెంట్ రాసే సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలనీ, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి ఏటా ఇంటర్ ఫలితాలు ఇస్తున్న సందర్భంలో ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. ఇంటర్ బోర్డ్ వివాదాస్పద నిర్ణయాలకు కేంద్రంగా మారిందని విమర్శించారు. కాబట్టి ఆ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క విద్యార్థీ ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీల బంద్ విజయవంతమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, జావేద్, ఓయూ నాయకులు రవి, కరణ్, విజరు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పుట్ట లక్ష్మణ్, శ్రీమాన్, శివ, క్రాంతి రాజ్ రహమాన్, పీడీఎస్‌యూ నాయకులు మహేష్, గడ్డం శ్యాం, అనిల్, ఏఐడీఎస్వో నాయకులు మల్లేష్, పీడీఎస్‌యూ నాయకులు రియాజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.