Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరానికి లక్ష నష్టపరిహారం ఇవ్వాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
- ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఖమ్మం
వైరస్సోకి మిర్చి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు వైరస్ సోకిన మిర్చి మొక్కలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ ధర్నాలో నున్నా మాట్లా డుతూ.. జిల్లాలో రైతులు 1.10 లక్షల ఎకరాలకు పైగా మిర్చి పంట సాగు చేశారనీ, పంటకు వైరస్ సోకడంతో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారనీ, లాభం రాకపోగా పెట్టిన పెట్టుబడి సైతం రాని పరిస్థితి ఏర్పడిం దని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ వల్ల 85 శాతం మంది రైతులు మిర్చి పంటను తొలగించారన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలో ఎటువంటి విపత్తు జరిగినా ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకోలేదని విమర్శించారు. పంట నష్టంతో ఇప్పటికే జిల్లాలో ఆరుగురు రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పం దించి పంట నష్టపోయి మనోవేదనకు గురవుతున్న రైతులకు ఆత్మస్థైర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులను ఆదుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. కౌలు రైతులకు నష్టపరిహారంతో పాటు అదనంగా కౌలు చెల్లించాలని కోరారు. రూ.5 వేల కోట్లు వెంటనే కేటాయించి రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. మిర్చిపంట నష్టాన్ని అధికారులతో సర్వే చేయించి, పరిహారాన్ని త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన మిర్చి రైతులకు ఉచితంగా ఎరువులు, పురుగుమందులు ఇవ్వాలని కోరారు. నష్టపరిహారం చెల్లించని పక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, భూక్య వీరభద్రం, చింతలచెర్వు కోటేశ్వరరావు, వై.విక్రమ్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంతు రాంబాబు, మాదినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.