Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒంటిపై డీజిల్ పోసుకుని గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం
- అడ్డుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించిన పోలీసులు
నవతెలంగాణ-నంగునూరు
కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా.. అధికారులు సహకరించకపోవడంతో ఆందోళనకు గురైన ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బద్దిపడగ గ్రామ పంచాయతీ పరిధిలోని ఊర తాండాకు చెందిన గిరిజన రైతు బానోతు అంజయ్య.. రాంపూర్ గ్రామానికి చెందిన గుడిపల్లి యాదగిరి, పోచయ్య, అశోక్, చంద్రకళల దగ్గర రాంపూర్ శివారులోని 6.06 ఎకరాల భూమిని 30ఏండ్ల కిందట కొనుగోలు చేశారు. అయితే అందులో కేవలం 3.14 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా.. మిగిలిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రెవెన్యూ కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. రూ.3లక్షలు లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. పహాణీలు సైతం రాకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన అంజయ్య.. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన అక్కడి సిబ్బంది అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజగోపాల్ పేట ఎస్ఐ మైపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడితో మాట్లాడారు. భూమికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే లాయర్ని పెట్టుకుని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించి.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ భూపతిని వివరణ కోరగా భూమికి సంబంధించి కోర్టులో కేసు ఉన్నందున రిజిస్ట్రేషన్ కావడం లేదనీ, కోర్టు సమస్య పరిష్కారం చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. రైతు అంజయ్య భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తాముకానీ, తమ సిబ్బంది కానీ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు.