Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనాస్థలంలోనే అల్లుడి తల్లి మృతి
- తండ్రి, అమ్మమ్మకు గాయాలు
నవతెలంగాణ-నిడమనూరు
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తరపు బంధువులు భర్త కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో భర్త తల్లి మృతిచెందింది. తండ్రి, అమ్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపాడ్ గ్రామంంలో మంగళవారం జరిగింది. ఇన్చార్జి సీఐ గౌరినాయుడు వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన కమతం భిక్షమయ్య- అచ్చమ్మల కుమారుడు శివనారాయణకు అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ - యశోదల కూతురు శ్యామలకు ఇచ్చి ఐదేండ్ల కింద వివాహం జరిపించారు. ఏడాదిపాటు ఆనందంగా ఉన్న వీరి మధ్య ఆ తరువాత మనస్పర్థలు పెరిగాయి. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టి ఇద్దరికీ అనేక సార్లు నచ్చజెప్పారు. అయినా గొడవలు ఆగలేదు. ఈ క్రమంలో సూర్యనారాయణ - యశోద అల్లుడి కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. మంగళవారం ఉదయం సుమారు 8గంటల సమయంలో శ్యామల తల్లిదండ్రులు, సోదరుడు శివ కలిసి శివనారాయణ ఇంట్లో చొరబడ్డారు. అల్లుడు శివనారాయణ, ఆయన తల్లి అచ్చమ్మ, తండ్రి భిక్షమయ్య, అమ్మమ్మ నారమ్మ కండ్లల్లో కారం చల్లి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అచ్చమ్మ(60) అక్కడికక్కడే మృతిచెందింది. శివనారాయణ, భిక్షమమ్మ, నారమ్మకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సాయంతో పోలీసులు వారిని మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శివనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.