Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీలు విస్మరించి మోసపూరిత పాలన: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ-గార్ల
పాలకుల కుట్రలను ప్రజలు గుర్తించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య కోరారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ జిల్లా మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. రాములుతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి వంచించారని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోడీ, ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మోసపూరిత విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేసి సమరశీల పోరాటాలు నిర్మించడం ద్వారా సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తామన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, దళితులకు భూపంపిణీ, పోడు రైతులకు పట్టాలు.. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కరోనా నిర్మూలనలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
మతోన్మాద బీజేపీ కుట్రలను ప్రజలు గమనించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటాలే శరణ్యమని స్పష్టం చేశారు. బలమైన ప్రజా ఉద్యమాల నిర్మాణానికి రంగారెడ్డి జిల్లాలో 2022 జనవరి 22, 23, 24 తేదీల్లో నిర్వహించనున్న పార్టీ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణకు రూపకల్పన చేస్తామని తెలిపారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు గుగులోతు ధర్మ, మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.