Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే విద్యాసంవత్సరంలో దాన్ని పూడ్చడమే లక్ష్యం
- మెరుగైన బోధన, అభ్యసనపై దృష్టి : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారితో విద్యారంగానికి తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్ అన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఆ నష్టాన్ని పూడ్చడమే లక్ష్యమని చెప్పారు. ఇటీవల నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయెన్స్ (నిసా), ట్రస్మా సంయుక్తంగా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 3,4,8 తరగతులకు చెందిన 1,502 మంది విద్యార్థులను ప్రత్యేక ప్రశ్నావళితో సర్వే చేశాయి. ఆ వివరాలను వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో 2019-20, 2020-21 రెండు విద్యాసంవత్సరాల్లోనూ విద్యాసంస్థలు మూతపడ్డాయని చెప్పారు. విద్యారంగాన్ని కరోనా ప్రభావం ఇంకా వెంటాడుతున్నదని అన్నారు. 50 శాతం పిల్లలు ఇంకా తరగతులకు హాజరు కావడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యం బాగా తగ్గిపోయిందని వివరించారు. ఆన్లైన్ తరగతులు నిర్వహించినా ఐపాడ్, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేకపోవడం వల్ల వారు వినలేకపోయారని అన్నారు. పట్టణాలు, ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఆన్లైన్ పాఠాలతో ప్రయోజనం పొందారని చెప్పారు. అయితే విద్యార్థులకు చదవడం, రాయడం, గుర్తుపట్టడం రావడం లేదనీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ఇబ్బందిపెట్టడం, భయపెట్టడం, కొట్టడం సరైంది కాదన్నారు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై దృష్టి సారించాలనీ, విద్యార్థులు నష్టపోయిన దాన్ని పూడ్చాలని కోరారు. మెరుగైన బోధన, అభ్యసనా సామర్థ్యం పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎస్ మధుసూదన్, నిసా పరిశోధకులు, ట్రస్మా సలహాదారు ఈ ప్రసాద్‌రావు, ట్రస్మా నాయకులు ఉమామహేశ్వర్, కొమరయ్య, యాదగిరి, బీరప్ప, జయసింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వినోద్‌కుమార్‌తో బీహార్ మైనార్టీ కమిషన్ చైర్మెన్ హకీం భేటీ
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్‌తో మంగళవారం హైదరాబాద్‌లో బీహార్ మైనార్టీ కమిషన్ చైర్మెన్ యూనుస్ హుస్సేన్ హకీం భేటీ అయ్యారు. మైనార్టీల సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని హకీం తెలిపారు. ఇక్కడి పథకాలను బీహార్‌లోనూ అమలు చేస్తామని వివరించారు. ఈ పథకాల గురించి తమ సీఎం నితీష్‌కుమార్‌కు వివరిస్తామని పేర్కొన్నారు. మూడేండ్ల కాలంలో 1,400 కేసులను తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మెన్ ఖమరుద్దీన్ పరిష్కరించారని వినోద్‌కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఏడేండ్లలో రాష్ట్రంలో 1,81,398 మంది మైనార్టీలకు షాదీముబారక్ పథకం కింద రూ.1,402 కోట్లు విడుదల చేయడం చారిత్రాత్మకమని అభివర్ణించారు.