Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు పెంచాలి
- తక్షణమే స్పందించి డిమాండ్లు నెరవేర్చాలి
- వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి : టియుఎంహెచ్ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్టు వర్కర్లకు వేతనాలు పెంచుతామంటూ ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోవడం లేదని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) ఆవేదన వెలిబుచ్చింది. ఆస్పత్రుల్లో పని చేసే వర్కర్ల సమస్యలపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి మంగళవారం హైదరాబాద్లో వినతిపత్రం సమర్పించారు. వైద్యవిద్య, వైద్య విధాన పరిషత్ విభాగాల పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్ వర్కర్లు, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డులకు వేతనాలు పెంచాలనీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో జీవో 60 అమలుకు చర్యలు తీసుకోవాలని, పీఎఫ్ లలో కాంట్రాక్ట్ సంస్థలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలనీ, కార్మిక, యజమాని వాటాలు సక్రమంగా జమ చేయాలని వారుడిమాండ్ చేశారు. కార్మికశాఖ నిర్ణయించిన సెలవులతో పాటు ఏడాదికి 24 సీఎల్స్ ఇవ్వాలనీ, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి మానవ వనరుల నిర్వహణను ఆస్పత్రుల అధికారులకు అప్పగించి కాంట్రాక్టర్ల దోపిడీ, అవినీతి అరికట్టాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పని చేస్తున్న వారందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, సెలవులు, యూనిఫాంలలో అవకతవకలు లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బందికి ప్రతి రోజు సరిపడా శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్ల కొరత లేకుండా అందించాలని వారు డిమాండ్ చేశారు.
శానిటేషన్, పేషెంట్ కేర్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, ఆఫీస్ సబ్ స్టాఫ్ తదితరులు ఏండ్ల తరబడి నామమాత్రపు వేతనాలతో రూ.ఏడు వేల నుంచి రూ.తొమ్మిది వేలకు వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో చేసిన సేవలకు ఇస్తామన్న ఇన్సెంటివ్ లు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించి ఏడేండ్లు గడుస్తున్నా వేతనాలు పెంచకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో పని చేసే వర్కర్ల కోసం కార్మికశాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 68 ప్రకారం వేతనాలివ్వలేదని తెలిపారు.ఆ జీవో కాల పరిమితి ఐదేండ్లు పూర్తయ్యాక జీవో నెంబర్ 306 పేరుతో మరో జీవో విడుదల చేసిందని గుర్తుచేశారు. కొత్త జీవో ప్రకారం నిమ్స్ లో శానిటేషన్, స్వీపర్లు, పేషెంట్ కేర్ తదితర సిబ్బందికి రూ.16 వేలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఇదే పేరుతోమున్సిపాల్టీల్లో పని చేసే వర్కర్లకు రూ.12 వేల నుంచి రూ.17,500 వరకు ఇస్తున్నారని చెప్పారు. ఒకే రాష్ట్రంలో ఒకే రకమైన పని చేసే వారికి వివిధ రకాలుగా జీతాలు అమలు చేస్తున్నారని విమర్శించారు.