Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తవ్వేకొద్దీ పోర్టల్‌లో సమస్యలెన్నో.
- సీసీఎల్ఏ నియామకం లేదు.
- పట్టాలెక్కని డిజిటల్ సమగ్ర భూ సర్వే.
- ఇంకా తేలని వీఆర్వో, వీఆర్ఏల భవితవ్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ పంచాయితీలు, వివాదాల పరిష్కారానికి సర్వరోగ నివారణి అంటూ రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన 'ధరణి పోర్టల్'ను బాలారిష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. తవ్వేకొద్దీ పోర్టల్‌లో సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కమిటీలు, సబ్‌కమిటీలు వేసినా..చర్చోపచర్చలు జరుగుతున్నా భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో ప్రజల ఇబ్బందులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాదీ సీసీఎల్ఏ నియామకానికి నోచుకోలేదు. డిజిటల్ పద్ధతిలో సమగ్ర భూ సర్వే చేస్తామంటూ సర్కారు హడావిడి చేసినా అది ఇంకా పట్టాలెక్కలేదు. వీఆర్వో, వీఆర్ఏల భవితవ్యాన్ని తేల్చలేదు.
సమగ్ర సర్వే ఆర్భాటమే..
కొంత ఆలస్యమైనప్పటికీ మ్యానువల్ పద్ధతిలో సమగ్ర భూ సర్వే చేస్తే ప్రామాణికంగా నిలుస్తుందనీ, ఇందుకోసం రూ.200 కోట్ల దాకా ఖర్చవుతుందని రెవెన్యూ నిపుణులు రాష్ట్ర సర్కారుకు సూచించారు. రాష్ట్ర సర్కారు మాత్రం డిజిటల్ సర్వే వైపే మొగ్గు చూపింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దీనిపై నాన్చుతూనే ఉంది. భూతగాదాలు లేని భవిష్యత్ తెలంగాణ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆచరణలో అది పట్టాలెక్కలేదు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఇంచు తేడా లేండా భూములకు కొలతలేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... తొలుత 27 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసింది. రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్లు ఖర్చవుతుందని ఆంచనావేసింది. 29 సర్వే సంస్థలు టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నాయి. జూన్‌లో ఈ తతంగం పూర్తయితే నేటికీ సర్వే ముందడుగు పడలేదు.
ఇన్చార్జీల పాలనే...
రెవెన్యూ శాఖలో కీలకమైన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) పోస్టును ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి. ఈ ఏడాదిలో కచ్చితంగా సీసీఎల్ఏను రాష్ట్ర సర్కారు నియమిస్తుందనే చర్చ నడిచినప్పటికీ..నియామకమైతే జరగలేదు. ఈ ప్రభావం ఆశాఖ పనితీరుపై పడుతున్నది. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రాష్ట్ర రద్దు చేసి... 15 నెలలవుతున్నా వారిని ఏ శాఖకు బదిలీ చేస్తారనే దానిపై స్పష్టతలేదు. మొత్తం 5,485 మంది ఉద్యోగుల భవితవ్యాన్ని పెండింగ్‌లో పెట్టి నాన్చుతుండటంతో వీఆర్వోలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. వారికి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయి.
సవరణలే.. సవరణలు...
- ధరణి పోర్టల్‌కు సంబంధించి నిషేధిత జాబితాలో భూములు చేర్చడం, సర్వేనెంబర్ల తప్పిదాలు, విస్తీర్ణాల తగ్గుదల, పెండింగ్‌లోని సాదాబైనామాలకు పరిష్కారం లభించకపోవడంతోపాటు పేర్లలో తప్పిదాలు దొర్లాయి.
- జాయింట్ రిజిస్ట్రేషన్లు, సంస్థల భూముల అమ్మకాల ఆప్షన్ లేకపోవడం కూడా భూముల క్రయవిక్రయాలకు ఆటంకా లేర్పడ్డాయి.
- అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్లు రద్దయితే చలాన్లు, వివిధ రూపాల్లో ప్రజలు చెల్లించిన డబ్బులు తిరిగి రావడంలేదు.
- ధరణిపై అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు... ప్రధానంగా 18 రకాల సమస్యలున్నాయని గుర్తించి, మంత్రివర్గ ఉపసంఘానికి రిపోర్టు ఇచ్చారు.
- వీటికి అదనంగా మరో 10, 12 సమస్యలున్నాయంటూ పలు సంస్థలు గుర్తించాయి.
- వీటిపై ఏడాదిగా చర్చలు జరుగుతున్నా కొత్త మ్యాడ్యూల్ రాలేదు.
- సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసినా ప్రయోజనం దక్కలేదు.
- హెల్ప్ డెస్కులకూ అతీగతీ లేదు.