Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరురోజుల విడిది
- బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు : సమీక్ష నిర్వహించిన సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఈ నెల 29న హైదరాబాద్‌కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆరు రోజుల పాటు ఉండనున్నారు. జనవరి మూడో తేదీన తిరిగి వెళ్లిపోతారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై వివిధశాఖల అధిపతులతో మంగళవారం హైదరా బాద్‌లోని బీఆర్కేభవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతను, హైదరాబాద్ గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా మరింత ఇనుమడింపజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లోటుపాట్లు లేకుండా రాష్ట్రపతి పర్యటన సౌకర్యవంతంగా సాగేలా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రపతి నిలయంలోకి వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ లేకుండా చూడాలన్నారు. రోడ్ల మరమత్తు, బారికేడింగ్ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు అధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్రపతి నిలయం వద్ద ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వహించేందుకు వైద్య, భద్రతా, ఇతర శాఖల బృందాలను నియమించాలని సూచించారు.