Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిన్నెదారలో 3.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
- మరో నాలుగైదు రోజులూ ఇదే పరిస్థితి
- రాష్ట్రం మీదుగా వీస్తున్న చల్లని గాలులు
- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుహు..హుహు..అనేలా చలి వణుకు పుట్టిస్తున్నది. పదేండ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా చలి భయానికి ఇంటి తలుపులు తీయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వృద్ధులు, చిన్నారులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కొమ్రంభీమ్ అసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏడెనిమిది డిగ్రీలలోపే ఉంటున్నాయి. ఆ ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రాష్ట్రం మీదుగా ఈశాన్య దిశ నుంచి చల్లని గాలులు వీస్తున్నాయనీ, వచ్చే నాలుగైదు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. కొమ్రంభీమ్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదారలో అత్యల్పంగా 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. ఆదిలాబాద్ జిల్లాలో 2015 డిసెంబర్ 13, 2017 డిసెంబర్ 27 తేదీల్లో కూడా ఇదే ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో పదిలోపు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కొమ్రంభీమ్, మంచిర్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే ఉన్నాయి. ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ ఉదయం బాగా పొగమంచు కమ్ముకుంటున్నది. 10 నుంచి 15 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. నగరంలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి ఉపరితల గాలులు వీస్తున్నాయి.
తెలంగాణ అభివృద్ధి, ప్రణాళికా సంస్థ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
గిన్నెదార (కొమ్రంభీమ్ అసిఫాబాద్) 3.5 డిగ్రీలు
సిర్పూర్(యు) (కొమ్రం భీమ్ అసిఫాబాద్) 3.8 డిగ్రీలు
బేల (ఆదిలాబాద్) 3.8 డిగ్రీలు
అర్లి(టి)(ఆదిలాబాద్) 3.9 డిగ్రీలు
జైనద్(ఆదిలాబాద్) 4.9 డిగ్రీలు
వాంకిడి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 4.9 డిగ్రీలు
చప్రాల్(ఆదిలాబాద్) 5.1 డిగ్రీలు