Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ జరపాలి
- కనీస మార్కులతో పాస్ చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు గందరగోళంగా మారాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలిపింది. 2019 ఇంటర్ ఫలితాలలో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ప్రస్తుత ఫలితాల్లో అన్యాయం జరిగిన విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను నిర్వహించాలని సూచించింది. కనీస మార్కులతో విద్యార్థులను పాస్ చేయాలని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేండ్లుగా విద్యార్థులు తరగతి పాఠాలకు దూరమయ్యారని తెలిపారు. ఈ నేపధ్యంలోనే వచ్చిన ఆన్లైన్ పాఠాలు అందించే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇవి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. ప్రయివేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత ఉండి, ఇంటర్నెట్ సదుపాయం కలిగిన పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు కొంతమేరకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం లేని, మారుమూల, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక ఈ సదుపాయాలకు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ఇంటర్ ఫలితాల పట్ల తల్లిదండ్రుల్లో వచ్చిన ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. దీనికితోడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,782 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటిని భర్తీ చేయలేదని పేర్కొన్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత అతిథి లెక్చరర్లను నియమిం చారని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లో కరోనా కాలంమంతా తరగతులు జరగలేదని తెలిపారు. ఇన్ని గందరగోళాల మధ్య అక్టోబర్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను బోర్డు నిర్వహించిందని గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా 2,35,230మంది (51శాతం) విద్యార్థులు ఫెయిలయ్యారని వివరించారు. వారిలో అత్యధికులు ప్రభుత్వ కళాశాలలు, గురుకులాల్లో చదువుకుంటోన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులేనని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డులో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మెజారిటీ పిల్లలు ఫెయిల్ కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్ బోర్డు నిర్వాకమే కారణమని విమర్శించారు. కాబట్టి వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫెయిలైన పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరముందని తెలిపారు. తాత్కాలిక సమస్య పరిష్కారంతోపాటు భవిష్యత్‌లో విద్యావ్యవస్థను పటిష్ఠపరిచే దీర్ఘకాలిక ప్రణాళికపై ప్రభుత్వం దష్టి పెట్టాలని సూచించారు. విద్యార్ధులకు మరోసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.