Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతపరమైన దాడులు శాశ్వతం కాదు
- రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తాం : క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏ మతమైనా ఉన్మాద స్థితికి చేరితేనే ప్రమాదమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో మతపరమైన దాడులు జరుగుతున్నాయనీ, అవి శాస్వతం కాదనీ, మానవత్వమే శాశ్వతమని చెప్పారు. ఎంతోమంది మహానుభావుల త్యాగాలతో నాగరిక సమాజం ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. అన్ని మతాలు శాంతి, సహనాన్ని ప్రబోధించాయని గుర్తుచేశారు. తోటి వారిని ప్రేమించటమే మానవజాతి అభిమతం కావాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కోసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో పిచ్చి ముస్లింలు దేవాలయాలను ధ్వంసం చేశారు..దానివల్ల మానవజాతికి ఎటువంటి మేలు జరగలేదని చెప్పారు. పుట్టిన బిడ్డ కెవ్వుమని ఏడ్చే తీరు ముస్లిం దేశంలోనైనా, క్రిసియన్ దేశంలోనైనా, ఇక్కడైనా ఒకే తీరుగా ఉంటుందని తెలిపారు. గిల్లితే ఏర్పడే బాధ భూగోళం మొత్తం ఒకే తీరుగా ఉంటుందని చెప్పారు. అది సహజ లక్షణమన్నారు. మనిషి సహజ లక్షణాలతో జీవిస్తేనే అందరికీ మంచిదన్నారు. అయితే అవి ఉన్మాదస్థితికి చేరడం ప్రమాదకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి హక్కులను రక్షిస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. సమాజా నికి త్యాగం చేసేవారు కావాలి కానీ నష్టం కలిగించేవారు అవసరంలేదని చెప్పారు. ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అన్ని మతాల, వర్గాల నిలయమైన ఇండియాఅందమైన రంగుల దేశమని తెలిపారు. అన్ని వర్గాల సహకారంతో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదనీ, అనేక రంగాల్లో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నదని వివరించారు. క్రైస్తవ మత పెద్దలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించిపరిష్కరిస్తామని సీఎం హామీఇచ్చారు. క్రిస్మస్ వేడుకల్లో మంంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, సబితా, సత్యవతి, మహమూద్ అలీ, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.